Elon Musk: ట్విటర్‌ కొనుగోలుతో కరిగిపోతున్న మస్క్‌ సంపద!

ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధుల కోసం మస్క్‌ మరికొన్ని టెస్లా షేర్లను విక్రయించారు. దీంతో టెస్లా షేర్లు మరింత పతనమయ్యాయి. ఫలితంగా మస్క్‌ నికర 200 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది.

Published : 09 Nov 2022 14:45 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ కొత్త యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ 4 బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. నవంబరు 4 నుంచి 8 మధ్య దాదాపు 19.5 మిలియన్ల షేర్లను అమ్మినట్లు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధుల కోసం గత ఆగస్టులోనూ మస్క్‌ 7 బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే.

ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధుల కోసం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు మస్క్‌ 19 బిలియన్ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను అమ్మారు. మస్క్‌ ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతుండడానికి టెస్లా షేర్ల విలువే ప్రధాన కారణం. తాజా విక్రయంతో టెస్లా షేరు ధర మంగళవారం భారీగా పతనమైంది. దీంతో ఆయన సంపద ‘ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్స్‌’ జాబితాలో 200 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఇప్పటికీ ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు.

ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కావాల్సిన నిధులను మోర్గాన్‌ స్టాన్లీ సహా మరికొన్ని బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నారు. కొంతమంది ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా నిధులు అందించడానికి ముందుకు వచ్చారు. మరోవైపు మస్క్‌  సొంతంగా 15.5 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తానని ఒప్పందంలో పేర్కొన్నారు. ఒకవేళ ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఎవరైనా పక్కకు జరిగితే.. మస్క్‌పై మరింత భారం పడుతుంది. మంగళవారం టెస్లా షేరు 2.9 శాతం పతనమై 191.30 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్‌ 52 శాతం తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని