Twitter: ఇలా అయితే ట్విటర్‌ దివాలా తీస్తుంది.. మస్క్‌ హెచ్చరిక!

ట్విటర్‌ను సొంతం చేసుకొని రెండు వారాలు గడిచిన సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ ఉద్యోగులతో సమావేశమయ్యారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని.. ఆదాయ మార్గాలను మెరుగుపరచాలని కోరారని తెలుస్తోంది.

Updated : 11 Nov 2022 15:58 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: మరింత ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమైతే ట్విటర్‌ దివాలా (Twitter bankruptcy) తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఉద్యోగులతో అన్నట్లు సమాచారం. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలని.. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ట్విటర్‌ (Twitter) కొనుగోలు ప్రక్రియ పూర్తయిన రెండు వారాల తర్వాత ఆయన తొలిసారి శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఉద్యోగులతో సమావేశమైనట్లు సమాచారం. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

మరోవైపు ఇప్పటికే మస్క్‌ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించగా.. మరికొంత మంది స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. తాజాగా మస్క్‌ కొత్త బృందంలో కీలక పదవుల్లో ఉన్న యోల్‌ రోత్‌, రాబిన్‌ వీలర్‌ ట్విటర్‌ (Twitter)ను వీడుతున్నట్లు గురువారం ప్రకటించి సంచలనం సృష్టించారు. రోత్‌ సామాజిక మాధ్యమం విశ్వసనీయత, భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే బాధ్యతలను ఇటీవలే స్వీకరించారు. మరోవైపు ప్రకటనదారులతో సంబంధాలను మెరుగుపరిచే అంశాలను వీలర్‌ పర్యవేక్షిస్తున్నారు. భద్రత, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే విషయంలో ట్విటర్‌ (Twitter) సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారు కంపెనీని వీడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మస్క్‌ తెస్తున్న మార్పులపై అనుమానాలతో పలువురు ప్రకటనదారులు ట్విటర్‌ (Twitter) నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా ఈ తరుణంలో కీలక వ్యక్తులు కంపెనీని వీడడం ఆందోళన కలిగించే విషయం.

ట్విటర్‌ (Twitter)ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంట్లో 13 బిలియన్ డాలర్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఏడు బ్యాంకులు ఈ మొత్తాన్ని సమకూర్చాయి. వీటిని వదిలించుకునేందుకు ప్రస్తుతం ఈ బ్యాంకులు తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఈ రుణాలను తీసుకునేందుకు ఏ ఫండ్‌ కంపెనీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కొన్ని సంస్థలైతే ఒక డాలర్‌ రుణానికి కేవలం 60 సెంట్లు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఈ రేటును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ఇస్తుంటాయి. అయితే, బ్యాంకులు 70 సెంట్లకు విక్రయించడానికి సంసిద్ధంగా ఉన్నాయట! అంటే దాదాపు 30 శాతం నష్టపోవడానికి కూడా బ్యాంకులు వెనుకాడడం లేదంటే ట్విటర్‌ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!

ఉద్యోగులతో సమావేశంలో మస్క్‌ కీలక హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. వారంలో 80 గంటలు అంటే రోజుకు 12 గంటలపైనే పనిచేయాలని సూచించినట్లు సమాచారం. అలాగే ఉచిత భోజనం, వర్క్‌ ఫ్రమ్‌ హోం వంటి సదుపాయాల్ని వదులుకోవడానికి సిద్ధపడాలని కోరారట! ఇవి నచ్చనివారు రాజీనామా చేయొచ్చని తెలిపారని తెలుస్తోంది. నెలకు 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారని సమాచారం. ప్రకటనదారులు వెనక్కి తగ్గిన నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం చాలా కీలకమని వివరించారట! బ్యాంకుల నుంచి మస్క్‌ తీసుకున్న రుణానికి  ట్విటర్‌ ఏటా 1.2 బిలియన్‌ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts