EPFO: 73 లక్షల మందికి ఒకేసారి పింఛను!

దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో నమోదైన పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను జమ కానుంది...

Updated : 11 Jul 2022 15:12 IST

ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న ఈపీఎఫ్‌ఓ

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో నమోదైన పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను జమ కానుంది. ఈ నెల 29-30న జరిగే సమావేశాల్లో ‘కేంద్రీకృత పింఛను సరఫరా వ్యవస్థ’ అమలుకు ఈపీఎఫ్‌ఓ ఆమోదం తెలపనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న 73 లక్షల మంది పింఛనుదారులందరికీ ఒకేసారి పెన్షన్‌ డిపాజిట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 138 ప్రాంతీయ ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలు వేర్వేరు తేదీల్లో లేదా ఒకేరోజు వేర్వేరు సమయాల్లో లబ్ధిదారులకు పింఛను జమచేస్తున్నాయి. కానీ, తాజాగా ప్రతిపాదించిన కేంద్రీకృత వ్యవస్థకు ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి పింఛను అందుతుంది. 

నకిలీ ఖాతాలు, నిరుపయోగంలో ఉన్న ఖాతాల ఏరివేతకు కూడా ఈ ప్రతిపాదన ఉపయోగపడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈసారి జరగబోయే సమావేశంలో 6 నెలల కంటే తక్కువ కాలం పీఎఫ్‌ ఖాతా యాక్టివ్‌గా ఉన్నవారికి కూడా పీఎఫ్‌ సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 6 నెలల నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి మాత్రమే పీఎఫ్‌ సొమ్మును ఉపసంహరించుకునే అర్హత ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని