Festive sales: పండగకు ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌ మీ కోసమే!

Festive sales: పండగ సీజన్‌లో ఎవరైనా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? మరి ఆయా సంస్థలు ప్రకటించిన రాయితీల నుంచి అధిక ప్రయోజనం పొందాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి....

Updated : 20 Sep 2022 13:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్‌ వచ్చిందంటే చాలు.. అందరూ ఇ-కామర్స్‌ (e-Commerce) సంస్థల ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. ఇప్పటికే అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వంటి బడా సంస్థలు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్, బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట ప్రత్యేక కొనుగోలు తేదీలను ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు కూడా పండగ రాయితీలు, ప్రయోజనాలను తీసుకొచ్చాయి. అయితే, వీటి నుంచి వీలైనంత ఎక్కువ లబ్ధి పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటో చూద్దాం..

సభ్యత్వం తీసుకోండి..

ఇ-కామర్స్ (e-Commerce) సంస్థలు అందించే ప్రత్యేక సభ్యత్వ పాలసీలను వినియోగించుకోవాలి. అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ వంటి వాటి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం వల్ల ఆఫర్లను కాస్త ముందే పొందొచ్చు. కొన్ని వస్తువులు అమ్మకాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అట్లాంటి వాటిని సొంతం చేసుకోవాలంటే.. ప్రత్యేక సభ్యత్వం తప్పదు మరి. సాధారణ సమయాల్లోనూ సబ్‌స్క్రిప్షన్‌ వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు అమెజాన్‌ ప్రైమ్‌ వల్ల ప్రైమ్‌ వీడియోతో పాటు అమెజాన్ మ్యూజిక్‌ సేవలు పొందొచ్చు. కిండిల్‌లో ఉచితంగా పుస్తకాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బ్యాంకు/కార్డు వివరాలను ముందే సేవ్‌ చేసి పెట్టుకోండి..

ఇంతకు ముందే చెప్పినట్లు ఐఫోన్‌ వంటి డిమాండ్‌ ఉండే వస్తువుల్ని సొంతం చేసుకోవాలంటే బ్యాంకు, కార్డు వివరాలను ముందే ఇ-కామర్స్‌ ఖాతాలో నమోదు చేయండి. అప్పుడే ఏమాత్రం ఆలస్యం లేకుండా కావాల్సిన వస్తువును బుక్‌ చేసుకోవచ్చు.

అప్‌డేట్‌ చేయండి..

ఒకవేళ ఆయా సంస్థల యాప్‌ల నుంచి వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నట్లయితే.. యాప్‌ల తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. అలాగే చిరునామా వంటి వివరాల్ని తాజాపరచాలి. ఒకవేళ నివాస ప్రాంతం మారినట్లయితే, కొత్త అడ్రస్‌తో చిరునామాను మార్చాలి. అలాగే మీరు కొనబోయే వస్తువు మీ ప్రాంతానికి డెలివరీ చేస్తారా.. లేదా.. ముందే చెక్‌ చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించాక ఆర్డర్‌ చేయబోయే ముందు మీ ప్రాంతానికి డెలివరీ అందుబాటులో లేదు అనే సందేశం దర్శనమిస్తే గందరగోళం తప్పదు. అందుకే ముందే చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతుంటుంది.

తొందరపడాల్సిందే..

ఈ ప్రత్యేక కొనుగోలు సమయాల్లోనే వివిధ తయారీ సంస్థలు తమ నూతన ఉత్పత్తులను విడుదల చేస్తుంటాయి. అయితే, అవి పరిమిత సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సొంతం చేసుకోవాలంటే.. సేల్‌ ప్రారంభమైన తొలి గంటల్లోనే కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. సమయం గడుస్తున్న కొద్దీ స్టాక్‌ అయిపోయే అవకాశం ఉంది. మళ్లీ అవి సేల్‌కి రావాలంటే చాలా కాలం పట్టొచ్చు. వచ్చినా.. అప్పటికి ఎలాంటి రాయితీ లేకపోతే.. ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది.

రిటర్న్‌, ఎక్స్ఛేంజీ పాలసీలు..

కొన్ని వస్తువులు కొనేటప్పుడు కచ్చితంగా రిటర్న్‌, ఎక్స్ఛేంజీ పాలసీని ముందే గమనించాలి. ముఖ్యంగా దుస్తులు, పాదరక్షల విషయంలో ఇది తప్పనిసరి. ఎందుకంటే సైజ్‌ సరిపోకపోతే రిటర్న్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది విక్రేతలు తిరిగిచ్చే వస్తువులను స్వీకరించబోమని షరతు విధిస్తుంటారు. అలాగే అంతే విలువ చేసే మరో వస్తువుని కొనుగోలు చేయాలని నియమం పెడుతుంటారు. డబ్బు మాత్రం వాపసు ఇచ్చేది లేదని చెబుతారు. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఒక్కోసారి రిటర్న్‌ తీసుకొని దాని స్థానంలో మరొకటి తెచ్చివ్వడానికి చాలా సమయం తీసుకుంటుంటారు. అందుకే ముందే రిటర్న్‌, ఎక్స్ఛేంజీ పాలసీని క్షుణ్నంగా గమనించాలి.

ప్రయోజనాలను కలిపేయాలి..

కొన్ని వస్తువుల ధరపై రాయితీతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని కలిపితే అధిక లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఒక వస్తువుపై ఈ పండగ సేల్స్ సందర్భంగా 10 శాతం రాయితీ ఇస్తున్నారనుకుందాం. పైగా ఏదైనా నిర్దిష్ట క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేయడం వల్ల మరో 5శాతం అదనపు రాయితీ ఉంటే రెండింటినీ కలిపి మొత్తం 15 శాతం రాయితీ పొందేందుకు ప్రయత్నించాలి. అంతటితో ఆగకుండా ఒక నిర్దిష్టం మొత్తం విలువ చేసే షాపింగ్‌ చేస్తే.. మొత్తం బిల్లుపై ఆఖర్లో మరో 10 శాతం రాయితీ అని కూడా కొన్ని ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటిస్తుంటాయి. ఇలా వివిధ రకాల ప్రయోజనాల్ని కలుపుకొని.. పొందే ప్రయోజనాన్ని అధికం చేసుకోవాలి. 

ముందస్తు ప్రణాళిక..

చాలా మంది ఇలాంటి ప్రత్యేక ఆఫర్ల సమయం కోసం కొనుగోళ్లను వాయిదా వేస్తూ వస్తుంటారు. అందుకే మీరు కొనాలనుకుంటున్న వస్తువుల పట్టికను ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఆఫర్లు ప్రారంభం కావడానికి ముందు వాటి ధర ఎలా ఉందో గమనించాలి. అలాగే అత్యవసరమైనవేవి.. కానివేవో కూడా ముందే గుర్తించాలి. మీ బడ్జెట్‌ ఎంత.. ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో స్పష్టతతో ఉండాలి. ముందుగా అవసరమైనవి కొని.. తర్వాత బడ్జెట్‌ అనుకూలిస్తే మిగిలిన వాటిని తీసుకోవాలి. 

సోషల్‌ మీడియానూ ఫాలో అవ్వండి..

ఎన్ని ఆఫర్లు ఉన్నా.. వాటిలో ఆకర్షణీయమైన వాటిని గుర్తించడం కొంచెం కష్టమైన పనే. అందుకే సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఉండాలి. కొంతమంది ఔత్సాహికులు తాము గుర్తించిన ప్రయోజనకరమైన ఆఫర్లను పోస్ట్‌ చేస్తుంటారు. అది అందరికీ షేర్ చేయడం వల్ల వైరల్‌గా మారి మన వద్దకు చేరొచ్చు. లేదా ఫెస్టివల్‌ సేల్స్‌ వంటి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లను గమనించడం వల్ల కూడా సమాచారం తెలుస్తుంది.  

సరిపోల్చుకోండి..

ఒక వస్తువును కొనే ముందు కొంత కసరత్తు అవసరం. ధర, ఫీచర్ల విషయంలో లబ్ధి పొందాలంటే ఆ వస్తువును విక్రయిస్తున్న వివిధ సంస్థలు, ఇ-కామర్స్‌ సైట్లను పరిశీలించాలి. దేంట్లో తక్కువ ధరకు దొరుకుతుంది? ఏ కంపెనీ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో సరిపోల్చుకోవాలి. ధర ఎక్కువైతే.. ఈఎంఐ కిందకు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయా.. లేదా.. చూడాలి. అలాగే కొన్ని బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు ఆయా ఇ-కామర్స్‌ సైట్లతో అనుసంధానమై ప్రత్యేకంగా ఆయా వేదికలపై మాత్రమే ప్రయోజనాల్ని అందిస్తుంటాయి. వాటిని గమనించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని