డిజిటల్‌ మెదడు.. ఉంటుంది తోడు

గూగుల్‌ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్‌ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్‌ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.

Updated : 11 Feb 2024 06:58 IST

మీ కోసం రాయనూ గలదు
చదివే, చూసే అంశాలు విశ్లేషించనూ గలదు
ఇతరత్రా పనులూ చేసేస్తుంది
గూగుల్‌ జెమినీ ఏఐ యాప్‌తో సాధ్యం

‘‘అల్ట్రా 1.0తో వస్తోన్న జెమినీ అడ్వాన్స్‌డ్‌ యాప్‌.. గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర, చట్టం, మెడిసిన్‌ వంటి 57 సబ్జెక్టుల్లో మానవ నిపుణులను అధిగమించగలదు. తెలివైనవారి కంటే మిన్నగా సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపగలదు.’’

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌


గూగుల్‌ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్‌ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్‌ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. మీరు చదివే, చూసే అంశాలను విశ్లేషించడం ద్వారా మీ జీవనాన్ని సులభతరం చేస్తుందని గూగుల్‌ అంటోంది.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్లకు..: చాట్‌జీపీటీకి పోటీగా గతేడాది గూగుల్‌ తీసుకొచ్చిన బార్డ్‌ చాట్‌బాట్‌ను పక్కనపెట్టి.. ఈ జెమినీ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తున్న స్మార్ట్‌ఫోన్ల కోసం ఒక స్టాండలోన్‌ జెమినీ యాప్‌ను గూగుల్‌ తక్షణం విడుదల చేయనుంది. కొద్ది వారాల్లో ఐఫోన్‌ వినియోగదార్ల నిమిత్తం జెమినీ యాప్‌ ఫీచర్లను అందజేస్తుంది. ఎందుకంటే యాపిల్‌ వినియోగదార్లు తమ సిరి వాయిస్‌ అసిస్టెంట్‌పై ఆధారపడతారు కాబట్టి.. అందుకు తగ్గట్లుగా తీసుకురావడానికి కొద్ది వారాల సమయాన్ని తీసుకుంటోంది.

ఆసియా-పసిఫిక్‌లో వచ్చే వారం..: జెమినీ యాప్‌ ప్రాథమికంగా అమెరికాలో ఆంగ్ల భాషలో విడుదల చేస్తారు. ఈ యాప్‌ను జపాన్‌, కొరియన్‌ వర్షన్లలో వచ్చే వారం ఆసియా-పసిఫిక్‌కు విస్తరిస్తారు. ఉచిత వర్షన్‌తో పాటు అధునాతన సేవలందించే కొత్త యాప్‌ను నెలకు 20 డాలర్లతో గూగుల్‌ విక్రయించనుంది.

ఎవరికి ఉపయోగం..?: ట్యూషన్‌ అవసరమయ్యే విద్యార్థులకు, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో సలహాలు అవసరమయ్యే ఇంజినీర్లకు, ప్రాజెక్టులకు ఆలోచనలు అందించేందుకు.. ఇలా ఒకటేమిటి ప్రతీ వినియోగదార్లు అడిగే కంటెంట్‌ను అందించేందుకు దీనిని ఉపయోగించుకోవచ్చని గూగుల్‌ చెబుతోంది.

10 కోట్ల మందికి..: గూగుల్‌ ఫొటోస్‌, డాక్యుమెంట్స్‌కు అదనపు స్టోరేజీ కోసం ఇప్పటికే నెలకు 2-10 డాలర్లు చెల్లించిన 10 కోట్ల మంది వినియోగదార్లకు ‘జెమినీ అడ్వాన్స్‌డ్‌ యాప్‌’ను అందించాలని కంపెనీ అనుకుంటోంది. ఈ యాప్‌ను ‘అల్ట్రా 1.0’ ఏఐ సాంకేతికతతో రూపొందించారు. ప్రస్తుతం నెలకు 10 డాలర్లకు అందిస్తున్న 2 టెరాబైట్ల స్టోరేజీని ఈ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా అందిస్తారు. అంటే నెలకు అదనంగా 10 డాలర్లు కడితే సరిపోతుందన్నమాట. జెమినీ అడ్వాన్స్‌డ్‌ను తొలుత రెండు నెలల పాటు ఉచితంగా అందించాలని గూగుల్‌ నిర్ణయించింది.

(కాగా, ఇప్పటికీ అత్తుత్యమ నమూనా మేమందిస్తున్న చాట్‌జీపీటీ-4 అనే మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొనడం గమనార్హం.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని