Internet: 76 కోట్ల మంది చేతిలో ఇంటర్నెట్‌.. వినోదానికే అధిక వినియోగమట!

భారత జనాభాలో ఇంటర్నెట్‌ యాక్టివ్ యూజర్ల సంఖ్య తొలిసారి 50 శాతం దాటింది. 2022 నాటికి దేశ జనాభాలో 75.9 కోట్ల మంది నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది.

Published : 04 May 2023 20:38 IST

దిల్లీ: ఇంటర్నెట్‌ వినియోగం (Internet Usage)లో భారత్‌ దూసుకెళ్తోంది. 2022 నాటికి దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు(నగర, గ్రామీణ ప్రాంతాలు కలిపి) నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది. దేశ జనాభాలో సగానికిపైగా(75.9 కోట్ల మంది/ 52 శాతం) అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగంపై ‘ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా- 2022 (Internet In India - 2022)’ పేరిట ఐఏఎంఏఐ (IAMAI), కాంటార్‌ (Kantar) సంస్థలు సంయుక్తంగా ఈ మేరకు నివేదిక రూపొందించాయి. ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశాయి.

మొత్తం 75.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో.. 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాలకు, 36 కోట్ల మంది పట్టణాలకు చెందిన వారు ఉన్నారు. గత ఏడాది పట్టణాలకు సంబంధించి ఆరు శాతంతో పోలిస్తే గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వినియోగంలో 14 శాతం వృద్ధి నమోదైంది. 2025 నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారని అంచనా. గోవాలో అత్యధికంగా 70 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. బిహార్‌లో 32 శాతం మాత్రమే ఉన్నారు. అంతర్జాలాన్ని అధికంగా వినోద రంగం, డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌, సామాజిక మాధ్యమాలకు వినియోగిస్తున్నట్లు నివేదికలో తేలింది.

ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 54 శాతం మంది పురుషులే ఉండగా.. 2022లో నమోదైన కొత్త వినియోగదారుల్లో 57 శాతం మంది మహిళలే ఉండటం సానుకూల పరిణామమని నివేదిక పేర్కొంది. 2025 నాటికి కొత్త వినియోగదారుల్లో 65 శాతం మంది మహిళలే ఉంటారని అంచనా వేసింది. దీంతో ఇంటర్నెట్‌ వినియోగంలో స్త్రీ- పురుష అంతరాలు తగ్గుతాయని తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో 2021తో పోలిస్తే 2022లో 13 శాతం వృద్ధి నమోదై.. 33.8 కోట్ల మంది వినియోగదారులకు చేరుకుంది. అందులో 36 శాతం మంది గ్రామీణ భారతానికి చెందిన వారు. మొత్తం డిజిటల్ చెల్లింపుల వినియోగదారుల్లో 99 శాతం మంది యూపీఐ వాడుతున్నారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని