17,300 ఎగువకు నిఫ్టీ

లోహ, ఐటీ, భారీ యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండో రోజూ రాణించాయి. దసరా సందర్భంగా బుధవారం మన మార్కెట్లు పని చేయలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడిన ప్రభావం, గురువారం మన మార్కెట్లపై కనిపించింది.

Published : 07 Oct 2022 02:17 IST

రెండో రోజూ రాణించిన సూచీలు

సమీక్ష

లోహ, ఐటీ, భారీ యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండో రోజూ రాణించాయి. దసరా సందర్భంగా బుధవారం మన మార్కెట్లు పని చేయలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడిన ప్రభావం, గురువారం మన మార్కెట్లపై కనిపించింది. అయితే బ్యాంకింగ్, టెక్‌ షేర్లలో లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు కొంత మేర తగ్గాయి. దీంతో సెన్సెక్స్‌ 157 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో లాభపడగా, షాంఘై, హాంకాంగ్‌ స్వల్పంగా నష్టపోయాయి. ఐరోపా సూచీలు ప్రతికూలంగా కదలాడాయి.

డాలర్‌ విలువ రూ.82.17: ఒపెక్‌ దేశాలు నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర ముడిచమురు ఉత్పత్తిలో కోత విధిస్తామని ప్రకటించడంతో చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది కనుక అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెరుగుతాయనే అంచనాతో, డాలరుకు గిరాకీ అధికమైంది. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 55 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది. రూపాయి 82 దిగువన ముగియడం ఇదే తొలిసారి. బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర 94.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* సెన్సెక్స్‌ ఉదయం 58,314.05 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 58,578.76 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 58,173.70 పాయింట్లకు పడింది. చివరకు 156.63 పాయింట్ల లాభంతో 58,222.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 57.50 పాయింట్లు లాభపడి 17,331.80 పాయింట్ల వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 2.27%, ఎల్‌అండ్‌టీ 2.24%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.04%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.98%, ఇన్ఫోసిస్‌ 1.76%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.65%, సన్‌ ఫార్మా 1.20%, విప్రో 1.13%, ఐటీసీ 1.11% చొప్పున పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 2.53%, హెచ్‌యూఎల్‌ 2.08%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.52%, హెచ్‌డీఎఫ్‌సీ 1.41%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.18%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.08%, పవర్‌గ్రిడ్‌ 1.06% మేర నష్టపోయాయి.

* అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద స్పైస్‌జెట్‌కు అదనంగా రూ.1,000 కోట్ల నిధులు అందుతాయన్న వార్తలతో సంస్థ షేరు 8.84 శాతం లాభపడి రూ.41.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 10.14 శాతం లాభంతో రూ.42.35 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.

* రూ.2,200 కోట్లతో పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ యాక్టిస్‌తో సంయుక్త సంస్థ (జేవీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు స్థిరాస్తి సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ గురువారం ప్రకటించింది.

* బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో విక్రయశాలల్ని నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా ఐపీఓకు రెండోరోజు ముగిసేసరికి 7.57 రెట్ల స్పందన లభించింది. సంస్థ 6.25 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా 47.29 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయని ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు వెల్లడించాయి. సంస్థాగతేతర విభాగంలో 11.74 రెట్లు, రిటైల్‌ విభాగంలో 7.81 రెట్లు, అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగంలో 4.01 రెట్ల స్పందన లభించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని