సేద్యానికి సాంకేతిక సాయం

ఆరుగాలం శ్రమించే రైతు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట ఎంపిక మొదలు, సస్యరక్షణ చర్యలు, చేతికి వచ్చాక సరైన ధరకు విక్రయించడం ఇలా ఎన్నో విషయాల్లో వారికి సందేహాలు ఉంటాయి.

Published : 29 Jan 2023 02:17 IST

ఈనాడు - హైదరాబాద్‌

ఆరుగాలం శ్రమించే రైతు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. పంట ఎంపిక మొదలు, సస్యరక్షణ చర్యలు, చేతికి వచ్చాక సరైన ధరకు విక్రయించడం ఇలా ఎన్నో విషయాల్లో వారికి సందేహాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలనూ సరిగ్గా వినియోగించుకోని వారెందరో. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వ్యవసాయానికి సాంకేతిక సాయం చేస్తున్న అంకురమే కిసాన్‌ దాస్‌ (ఇఅగ్రిసేవ.కామ్‌). రైతులకు అవసరమైన సేవలన్నీ ఒకేచోట అందేలా చూడాలనే ఆలోచన నుంచే తమ సంస్థ ఆవిర్భవించింది అంటున్నారు సహ వ్యవస్థాపకులు విజయ్‌ మనోహర్‌. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు.

‘ఏదైనా ఒక మంచి సంస్థను స్థాపించాలి.. దాని కోసం అనువైన రంగం ఏమిటి అని అన్వేషిస్తున్న సమయంలో వ్యవసాయం నన్ను ఆకర్షించింది. కంప్యూటర్‌ సైన్స్‌ చదివినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను పక్కన పెట్టాను. ఐఎస్‌బీలో రెండేళ్లపాటు ఐడియా టు స్టార్టప్‌ ల్యాబ్‌ కోర్సునూ పూర్తి చేశాను. నా ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లే దశలో అనేక సదస్సులకు హాజరయ్యాను. ఇలా నాకు చింతల వెంకటయ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటికే తను రైతులకు సహాయం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరం కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అనుకున్నాం. అప్పుడే కిసాన్‌ దాస్‌ (డిజిటల్‌ అగ్రి సర్వీసెస్‌)ను తీసుకొచ్చాం. మా ఆలోచనను టి-హబ్‌తో పంచుకున్నాం. అలా మాకు ర్యూబిక్స్‌ ప్రోగ్రాంలో చోటు లభించింది.


ఏం చేస్తామంటే..

రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, ఎరువులు, క్రిమిసంహారకాల వాడకంలో సలహాలు, యంత్రాలను అద్దెకు తెచ్చుకోవడం, పంటల బీమా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు.. ఇలా పలు ప్రభుత్వ పథకాల సమాచారమంతా ఒకేచోట అందేలా ఒక వేదికను ఏర్పాటుచేశాం. కిసాన్‌దాస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా రైతులు తమకు అవసరమైన సేవలను పొందొచ్చు. దీన్ని తెలుగులో అందిస్తున్నాం. తమ పంటను అమ్ముకునేందుకు కొనుగోలుదార్లతో అనుసంధానం చేస్తున్నాం. చీడపీడల నివారణకు మందుల పిచికారీ కోసం డ్రోన్ల సేవలనూ అందిస్తున్నాం. కలుపు మొక్కలను తొలగించేందుకు రోబోటిక్‌ మైక్రో ట్రాక్టర్లనూ అందుబాటులోకి తెచ్చాం. ఇలా రైతులకు అవసరమైన అన్ని విషయాల్లోనూ సహాయం చేయడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోని యువ రైతులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రైతులు పండించిన కొన్ని పంటలను మేమే నేరుగా కొనుగోలు చేసే ఏర్పాటూ చేస్తున్నాం.

ఇప్పటి వరకూ..

2022లో మా సంస్థను ప్రారంభించినప్పటి నుంచీ కొన్ని పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టాం. ఆ తర్వాత ఇటీవలే రెండు ఇఅగ్రిసేవా సెంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కో ఏజెంట్‌ ద్వారా కనీసం 100 మంది రైతులకు సేవలు అందుతాయి. రానున్న రోజుల్లో 500లకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, యువకులకు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ, లైసెన్సులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రోన్ల వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది.

లాభం పెంచేలా..

రైతులు తమ పంటలను మంచి ధరకు అమ్ముకునేందుకు కిసాన్‌దాస్‌అర్బన్‌నూ అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనే ఏర్పాటు చేస్తున్నాం. పంటను గ్రేడింగ్‌, ప్యాకేజింగ్‌ చేయడంలో రైతులకు సహాయం చేస్తాం. విదేశీ సాంకేతికతనూ రైతులకు పరిచయం చేసి, ఉత్పాదకతను పెంచేలా ప్రోత్సహిస్తాం. ఇప్పటివరకూ సొంతంగా నిధులు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కనీసం రూ.3 కోట్ల నిధుల కోసం చూస్తున్నాం. ఏడాదిలో 200 కేంద్రాలను ప్రారంభించడం మా లక్ష్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని