93.3% పెరిగిన నవ లిమిటెడ్‌ లాభాలు

విద్యుత్తు, ఫెర్రో అల్లాయ్స్‌ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్‌ (గతంలో నవ భారత్‌ వెంచర్స్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది.

Published : 04 Feb 2023 01:49 IST

ఆకర్షణీయంగా జాంబియా వ్యాపార కార్యకలాపాలు  

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు, ఫెర్రో అల్లాయ్స్‌ ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్‌ (గతంలో నవ భారత్‌ వెంచర్స్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం త్రైమాసిక ఆదాయం రూ.1,020 కోట్లు, నికరలాభం రూ.362 కోట్లుగా నమోదయ్యాయి. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.1,005 కోట్లు కాగా, నికరలాభం రూ.190 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఈసారి నికరలాభం 93.3% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రూ.2,938 కోట్ల ఆదాయాన్ని, రూ.880 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.2,506 కోట్లు, నికరలాభం రూ.213 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు నికరలాభం 314% పెరిగింది. జాంబియాలోని మాంబా కోల్‌ఫీల్డ్స్‌ నుంచి పెరిగిన ఆదాయాల వల్లే, మంచి ఫలితాలు నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ అశ్విన్‌ దేవినేని తెలిపారు. జాంబియా నుంచి నగదు లభ్యత పెరిగిందని, గత ఏడాది మే వరకు విద్యుత్తు విక్రయాలపై బకాయిలు పూర్తిగా వసూలైనట్లు వెల్లడించారు. తత్ఫలితంగా కంపెనీ ఆస్తి, అప్పుల పట్టీ బలోపేతం అయ్యిందని అన్నారు. జాంబియా పవర్‌ ప్లాంటు సమీక్షా త్రైమాసికంలో 99.5% పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) తో పనిచేసి, ఎంతో అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసింది. స్ల్టాండ్‌ అలోన్‌ ఖాతాల ప్రకారం డిసెంబరు త్రైమాసికంలో రూ.346 కోట్ల ఆదాయాన్ని, రూ.23.8 కోట్ల నికరలాభాన్ని కంపెనీ ఆర్జించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని