హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాం

అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, షేర్ల కదలికలపైనా ఓ కన్నేసినట్లు సుప్రీం కోర్టుకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ స్పష్టం చేసింది.

Updated : 15 Feb 2023 11:29 IST

షేర్ల కదలికలనూ గమనిస్తున్నాం
షార్ట్‌ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదు
అది చట్టబద్ధ పెట్టుబడుల ప్రక్రియే
సుప్రీం కోర్టుకు సెబీ స్పష్టీకరణ

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, షేర్ల కదలికలపైనా ఓ కన్నేసినట్లు సుప్రీం కోర్టుకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ స్పష్టం చేసింది. ‘షార్ట్‌ సెల్లింగ్‌ / అప్పుతెచ్చిన షేర్ల విక్రయంపై’ నిషేధం విధించే ఉద్దేశం కూడా లేదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనానికి రాతపూర్వకంగా నోట్‌ పంపింది. అదానీ గ్రూప్‌ షేర్ల విలువ ఒక్కసారిగా క్షీణించడం వల్ల, అమాయక మదుపర్లు భారీగా నష్టపోతున్నారంటూ దాఖలైన రెండు ప్రయాప్రయోజన వ్యాజ్యాలను(పిల్‌) ఈ ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.

20 పేజీల్లో సెబీ ఏం చెప్పిందంటే..

సుప్రీం కోర్టుకు సెబీ 20 పేజీల పత్రాలను పంపింది. అందులో షార్ట్‌ సెల్లింగ్‌ అంటే ఏమిటో.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఏం చేసిందన్నదానిపై వివరాలు అందజేసింది. అయితే ఒక్కసారి కూడా అదానీ గ్రూప్‌ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్పటికే హిండెన్‌బర్గ్‌ నివేదికలోని ఆరోపణలపైనా; ఆ నివేదిక వెలువడక ముందు, తర్వాత మార్కెట్లో కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టినట్లు అందులో తెలిపింది. నివేదిక వెలువడిన మూడు వారాల్లో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.10.2 లక్షల కోట్ల మేర క్షీణించిన సంగతి తెలిసిందే.

షార్ట్‌ సెల్లింగ్‌ నిషేధిస్తే..

‘మదుపర్లు కొన్ని షేర్లను అప్పుగా తీసుకుని.. వాటిని విక్రయిస్తారు. ఆ షేర్ల ధరలు తగ్గుతాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. అవి ఒక్కసారి కిందకు పడితే.. వాటిని కొనుగోలు చేసి.. తిరిగి లెండర్లకు అప్పజెబుతారు. ఈ పద్ధతిలో ‘అధిక విక్రయ ధరకు, తక్కువ కొనుగోలు ధర’కు మధ్య ఉన్న అంతరం ద్వారా లాభాలు పొందుతార’ని సెబీ సుప్రీంకు వివరించింది. ‘షార్ట్‌ సెల్లింగ్‌ అనేది సెక్యూరిటీ మార్కెట్లో అవసరమైనదేనని.. దీని వల్ల ద్రవ్యలభ్యత లభించడంతో పాటు ఓవర్‌ వేల్యూడ్‌ షేర్లు దిద్దుబాటుకు గురిఅవుతాయ’ని వివరించింది. అందువల్ల షార్ట్‌ సెల్లింగ్‌పై ఏవైనా ఆంక్షలు విధిస్తే.. షేర్లకు ఉన్న అసలు విలువను కనిపెట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తెలిపింది. ఈ విషయంలో ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ కమిషన్స్‌ (ఐఓఎస్‌సీఓ) విధానాన్ని భారత్‌ పాటిస్తోందని తెలిపింది. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ కేవలం 13 రోజుల్లో 26% పతనమైనా షార్ట్‌సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. తీవ్ర ఒడుదొడుకుల్లోనూ ట్రేడింగ్‌ సజావుగా సాగేందుకు అవసరమైన నిబంధనావళి, కట్టుదిట్టమైన వ్యవస్థలు ఉన్నట్లు స్పష్టం చేసింది.


ఆరోపణలు నుంచి కాపాడుకునేందుకు అదానీ ‘ఆడిట్‌ అస్త్రం’
గ్రాంట్‌ థార్టన్‌ నియామకం

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్‌ ఆడిట్‌ మార్గాన్ని పట్టింది. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్టన్‌ను నియమించింది. గ్రూప్‌ అన్ని చట్టాలను పాటిస్తోందని, ఏ విషయాలనూ దాచిపెట్టలేదని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వంటి నియంత్రణ సంస్థలకు నిరూపించడమే ఆడిట్‌ ముఖ్య ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ పరిశీలిస్తుంది..

‘నిధుల దుర్వినియోగం లేదా విదేశాల నుంచి నిధులు అక్రమంగా వచ్చాయా.. రుణాలు ఏ అవసరం కోసం తీసుకున్నారో- అందుకే వాడారా.. లేదా ఇతరత్రా అవసరాలకు వినియోగించారా’ వంటి అంశాలను ఈ ఆడిట్‌ సంస్థ పరిశీలిస్తుందని చెబుతున్నారు. కంపెనీ ఖాతాలకు వచ్చిన ఇబ్బంది లేదని, ప్రాజెక్టులు సకాలంలోనే పూర్తవుతాయంటూ అదానీ గ్రూప్‌ ప్రకటిస్తున్న సంగతి విదితమే. మదుపర్లు ఎదురుచూస్తున్న అంశాలను వెల్లడించాలంటే, ఆడిట్‌ సంస్థకు సమయం పట్టే అవకాశం ఉంది.

* వృద్ధి ప్రణాళికలన్నీ అనుకున్న సమయానికే పూర్తవుతాయని.. అన్నిటికీ పూర్తి నిధులున్నాయని  ప్రకటిస్తూ, వాటాదార్లలో విశ్వాసం నింపే ప్రయత్నాన్ని అదానీ గ్రూప్‌ చేస్తోంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం రూ.820 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.820 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో సంస్థ రూ.11.63 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం  గమనార్హం. ఆదాయం కూడా రూ.18,758 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.26,612.33 కోట్లకు చేరుకోవడం విశేషం. విమానాశ్రయ వ్యాపార ఆదాయాలు రెండింతలయ్యాయి. అయితే లాభదాయకత మాత్రం 29 శాతమే పెరిగింది. కంపెనీ మొత్తం వ్యయాలు 37% పెరిగి రూ.26,171.18 కోట్లకు చేరాయి.

* అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మంగళవారం మిశ్రమంగా కదలాడాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 1.91% పెరిగి రూ.1750.30 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 2.15%, ఏసీసీ 0.41% పెరిగాయి. అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ 5% చొప్పున కుదేలై లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అంబుజా సిమెంట్స్‌ 1.68% నష్టపోయింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత ఇప్పటివరకు అదానీ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ రూ.10.4 లక్షల కోట్లు ఆవిరైంది.


ఆర్థికంపై అదానీ సంక్షోభ ప్రభావం ఉండదు

అదానీ గ్రూప్‌ సమస్యల కారణంగా నేరుగా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురుకావు. అయితే కార్పొరేట్లకు రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. దీని వల్ల రుణాల జారీ ఆలస్యమై పరోక్ష ప్రభావం పడొచ్చు. అదానీ గ్రూప్‌ కంపెనీలకు బ్యాంకింగ్‌ రంగం 1 శాతం లోపు రుణాలే ఇచ్చాయి. ఆయా కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌లు కూడా ‘ఒత్తిడిలో’ లేవు. అయితే అదానీ గొడుకు కింద ఉన్న కొన్ని భారతీయ కంపెనీలకు నష్టభయం పెరిగితే పెరగొచ్చు.

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని