మారిషస్.. ష్ గప్‌చుప్!!
నగదు అక్రమ బదిలీ, పన్ను ఎగవేతకు అనువైన డొల్ల కంపెనీలకు కేంద్రంగా మారిషస్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తమపై ఉన్న ఈ మరకను తుడిచేయడానికి ఆ దేశం యత్నిస్తోంది.
అదానీ గ్రూప్‌పై ఆరోపణల నేపథ్యంలోమళ్లీ చర్చనీయాంశంగా మారిన దేశం
నగదు అక్రమ బదిలీ, పన్ను ఎగవేతకు అనువైన డొల్ల కంపెనీలకు కేంద్రంగా మారిషస్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తమపై ఉన్న ఈ మరకను తుడిచేయడానికి ఆ దేశం యత్నిస్తోంది. అయితే అదానీ గ్రూప్‌పై అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్లోనూ మారిషస్ కంపెనీల పాత్ర ఉండటంతో.. మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మారిషస్ పాత్రపై అనుమానాలు పెరిగాయి.
ఈ ఏడాది జనవరి 24న వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం, అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర కుప్పకూలింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ / ఆయన సహచరుల నేతృత్వంలోని కంపెనీలు మారిషస్‌ను మనీ లాండరింగ్‌కు వినియోగించాయని.. తద్వారా అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడ్డాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కరేబియన్ దీవుల నుంచి యూఏఈ వరకు ఉన్న షెల్ కంపెనీలకు పాత్ర ఉన్నా, మారిషస్‌లోని కంపెనీలే కీలక పాత్ర పోషించాయని హిండెన్‌బర్గ్ నొక్కి చెప్పింది. వినోద్‌తో అనుబంధం ఉన్న 38 సంస్థలు ఈ చిన్న దీవిలోనే ఉన్నాయని పేర్కొంది. భారత్ నుంచి తొలుత మారిషస్‌కు నిధులు బదిలీ చేసి, మళ్లీ అక్కడి నుంచి భారత్‌కు నగదు బదిలీ చేయడం ద్వారా అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయించి.. వాటి ధరలను పెరిగేలా చేశారన్నది ఆరోపణ. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూడటానికి ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు అయిదేళ్లలో 2600% పెరగడం గమనార్హం.
1990 నుంచీ..
పర్యాటకులకు స్వర్గధామమైన మారిషస్.. 1990ల్లోనే భారత కార్పొరేట్ వివాదాలకు కేంద్ర బిందువైంది. అందులో అతిపెద్దది స్టాక్ మార్కెట్ కుంభకోణం. 1998-2001 మధ్య కొన్ని షేర్ల విలువలను భారీగా పెంచడానికి ఒక బ్రోకరు (కేతన్ పరేఖ్) మారిషస్ దారినే ఎంచుకున్నారని అప్పట్లో గట్టిగా వినిపించింది. 2006-2007లో హెలికాప్టర్ ఒప్పందానికి సంబంధించి; 2008లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో, క్రికెట్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ అంశం (2010లో దర్యాప్తు)లోనూ మారిషస్ పేరే కనిపించింది. తాజాగా అదానీ విషయంలోనూ మళ్లీ మారిషస్ పేరే వినిపిస్తోంది. అయితే ఆ దేశం మాత్రం అదానీ గ్రూప్ ‘తమ దేశ నిబంధనలన్నిటినీ పాటించిందని.. భారత అధికారులతో తమ ప్రభుత్వం సహకరిస్తుంద’ని పేర్కొంటోంది. ‘మా దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలనే మేం కోరుకుంటున్నామ’ని ఆ దేశ ఆర్థిక మంత్రి మహేన్ కుమార్ సీరుత్తన్ అన్నారు కూడా.
15 శాతం పన్ను అంటుంది కానీ..
ఆర్థిక సహకార-అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) నిబంధనల ప్రకారమే కనీసం 15 శాతం కార్పొరేట్ రేటును విధిస్తున్నట్లు అంతక్రితం మారిషస్ స్పష్టం చేసింది. అయితే కొన్ని కంపెనీలకు కేవలం 3% పన్నునే వర్తింపజేస్తోంది. అందుకే చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. 1992లో ఆఫ్‌షోర్ వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం డజన్ల కొద్దీ ద్వైపాక్షిక పన్ను ఒప్పందాలను మారిషస్ కుదుర్చుకుంది. భారత్‌తోనూ 1980ల్లోనే ద్వంద్వ పన్నుల, మూలధన లాభాల పన్నులను తొలగించే ఒప్పందం చేసుకుంది. అయితే ఆ సమయంలో మనం సోవియట్ ఆధారిత సోషిలిస్ట్ ఆర్థిక వ్యవస్థను విడనాడి.. విదేశీ మూలధన విధానానికి వెళతామని ఊహించలేదు. ఇలా అన్ని దేశాలతోనూ ఒప్పందాలను ఎపుడో కుదుర్చుకోవడంతో.. ఇపుడు అత్యంత ధనవంత దేశాల్లో ఒకటిగా మారిషస్ ఉంది.
పారడైజ్ పేపర్స్ వెలుగు చూశాక
2017లో అంతర్జాతీయ జర్నలిస్టులకు లీకైన పత్రాల (పారడైజ్ పేపర్స్) అనంతరం మారిషస్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. భారత్ కూడా పలు ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో విదేశీ కార్పొరేట్లు ఎక్కువ పన్ను కట్టేలా విధానాలు తీసుకొచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య పన్ను ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. పీ నోట్లపైనా భారత్ నిబంధనలను కఠినం చేసింది. అయితే మారిషస్ 2021 అక్టోబరులో పన్ను చట్టాలు, ఒప్పందాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ ఒప్పందం ద్వారా కనీస కార్పొరేట్ పన్నును ఆవిష్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ సైతం నెలల వ్యవధిలోనే బ్లాక్‌లిస్ట్ నుంచి ఆ దేశం పేరును తొలగించింది.
అర్థం కాని... సాలెగూడు
భారతీయ కంపెనీలు మారిషన్ ద్వారా నగదును అక్రమంగా బదిలీ చేయడం ద్వారా పన్నును ఎగ్గొట్టడమే కాకుండా.. క్రిమినల్ చట్టాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. అదెలాగంటే.. డజన్ల కొద్దీ విదేశీ డొల్ల కంపెనీలను సృష్టించి.. ఒకదాని నుంచి మరొకదానికి డబ్బులు బదిలీ చేస్తూ ఒక సాలెగూడునే సృష్టిస్తారు. దీని వల్ల దర్యాప్తు సంస్థలకు ఎటు నుంచి ఎటు డబ్బు వెళుతుందో తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. అందుకే మారిషస్ మార్గాన్ని మన కంపెనీలు ఎంచుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్ని జరిగినా.. మారిషస్ చాలా మంది పెట్టుబడుదార్లకు ఆకర్షణీయ ఆఫ్‌షోర్ కేంద్రంగానే ఉంది. అదానీ సంక్షోభం తర్వాత ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతోందేమో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APGEA: ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఆపాలి: ఆస్కార్‌రావు
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: మరో రెండ్రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
-
Movies News
Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..
-
General News
Odisha Train Accident: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!