డిపాజిటర్లకు బైడెన్‌ భరోసా

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) దివాలా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థతో పాటు అమెరికా అధ్యక్షుడైన బైడెన్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది.

Updated : 14 Mar 2023 09:36 IST

ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంకుల్లో నగదు ఉపసంహరణకు అనుమతి

న్కూయార్క్‌/వాషింగ్టన్‌: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) దివాలా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థతో పాటు అమెరికా అధ్యక్షుడైన బైడెన్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ప్రభుత్వమూ రంగంలోకి దిగింది. ఎస్‌వీబీ డిపాజిటర్లందరికీ సోమవారం నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించింది. అయితే న్యూయార్క్‌లోని సిగ్నేచర్‌ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు తాజాగా ప్రకటించడం ఆందోళనను పెంచింది. ఈ బ్యాంకును సైతం ఎఫ్‌డీఐసీ (ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో అమెరికాలోని 2 బ్యాంకులు మూతపడడం, ప్రపంచవ్యాప్తంగా మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ విషయంలో ఎఫ్‌డీఐసీ, ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డుల సిఫారసులను అందుకున్న అనంతరం.. అధ్యక్షుడు బైడెన్‌తో సంప్రదించి ఆర్థిక శాఖ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. అందరు డిపాజిటర్లు సోమవారం నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించింది. బీమా పరిమితి ఉండే 2,50,000 డాలర్ల కు మించిన డిపాజిట్లు ఉన్నవారు కూడా నిధులు ఉపసంహరించేందుకు వీలు కల్పించినట్లు ప్రకటించారు.

* డిపాజిట్ల బదిలీ: ఎస్‌వీబీకి చెందిన అన్ని డిపాజిట్లను (బీమా పరిధిలోని, అంతకుమించిన) కొత్తగా ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జ్‌ బ్యాంక్‌కు ఎఫ్‌డీఐసీ బదిలీ చేసింది. (ఏదైనా బ్యాంకు విఫలమైతే, పరిష్కారం చూపే వరకు తాత్కాలికంగా ఈ తరహా బ్రిడ్జ్‌ బ్యాంక్‌కు ఆస్తులను బదిలీ చేయడం అమెరికాలో రివాజు.)

ఎఫ్‌డీఐసీ నియంత్రణలోకి సిగ్నేచర్‌ బ్యాంకు : న్యూయార్క్‌కు చెందిన సిగ్నేచర్‌ బ్యాంకును తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఎఫ్‌డీఐసీ సోమవారం ప్రకటించింది. రెండు దశాబ్దాల నాటి ఈ బ్యాంక్‌ స్థిరాస్తి, డిజిటల్‌ అసెట్స్‌ సహా 9 విభాగాల్లో సేవలందిస్తోంది. క్రిప్టోకరెన్సీ విలువలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటి డిపాజిట్లను అనుమతించాలని 2019లో ఈ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పతనానికి కారణమైంది. 2022 సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే.  క్రిప్టో విలువలు క్షీణిస్తున్నందున, ఈ డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్‌ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులోనే బ్యాంకు ప్రకటించింది. అయితే డిపాజిటర్లు ఒక్కసారిగా నిధుల ఉపసంహరణకు ప్రయత్నించడమే ప్రస్తుత స్థితికి కారణం. తమ స్వాధీనంలోకి వచ్చిన ఈ బ్యాంకు డిపాజిటర్లు కూడా తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎఫ్‌డీఐసీ పేర్కొంది.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : బైడెన్‌

ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంకుల పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని.. అందుకు తాను హర్షిస్తున్నానని తెలిపారు.

25 బి. డాలర్లతో తాత్కాలిక నిధి: ఫెడ్‌

బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 బిలియన్‌ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించింది.

హెచ్‌ఎస్‌బీసీ చేతికి ఎస్‌వీబీ యూకే యూనిట్‌

లండన్‌: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ అనుబంధ ఎస్‌వీబీ యూకే  విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ చర్యలు చేపట్టింది. ఎస్‌వీబీ యూకే దివాలా ప్రక్రియలో భాగంగా ఆ బ్యాంక్‌ను హెచ్‌ఎస్‌బీసీకు ఒక్క పౌండ్‌కే విక్రయించింది. ఆ బ్యాంక్‌ ఆస్తులు విక్రయించి, డిపాజిట్లు చెల్లిస్తామని యూకే ఆర్థిక శాఖ తెలిపింది.

భారత అంకురాలకు సాయం

ఎస్‌వీబీ కుప్పకూలడంతో ఇబ్బంది పడుతున్న అమెరికాలోని భారత అంకురాలకు మద్దతు ఇవ్వడానికి  యాక్సిస్‌ బ్యాక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ భారత విభాగం కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఉన్న తమ శాఖల్లో, ఆయా అంకురాలు డాలర్‌ ఖాతాలను తెరవడానికి సహాయం చేస్తున్నాయి.  

* డిపాజిటర్లను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున.. తమ రూ.64 కోట్ల డిపాజిట్లను తిరిగి పొందగలమన్న విశ్వాసం వచ్చిందని దేశీయ గేమింగ్‌ మీడియా ప్లాట్‌ఫాం నజారా టెక్‌ సీఈఓ పేర్కొన్నారు.  

భయాలు తొలిగాయి: ‘తాజా సంక్షోభం ఫలితంగా, భారత బ్యాంకింగ్‌ వ్యవస్థపై మరింత విశ్వాసం ఉంచాలని భారత అంకురాలు నేర్చుకున్నాయ’ని ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు. ‘తగిన విధంగా స్పందించిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి,   ఆర్‌బీఐలకు  ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని