మళ్లీ ఆసియా సంపన్నుడిగా అంబానీ

ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను మంగళవారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది.

Updated : 05 Apr 2023 07:30 IST

24వ స్థానానికి పడిపోయిన అదానీ
ఫోర్బ్స్‌ కుబేరుల జాబితా - 2023
దిల్లీ

సియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను మంగళవారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 83.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. ‘జనవరి 24న అదానీ 126 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో మూడో సంపన్నుడిగా ఉన్నారు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక తర్వాత ప్రస్తుతం ఆయన సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది’ అని ఫోర్బ్స్‌ తెలిపింది. అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా అదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 100 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది.  

ఫోర్బ్స్‌ జాబితాలోని అగ్రగామి 25 సంపన్నుల మొత్తం సంపద విలువ 2.1 లక్షల కోట్ల డాలర్లు. 2022లో వీరి సంపద 2.3 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 200 బిలియన్‌ డాలర్లు తక్కువ.  గతేడాదితో పోలిస్తే మూడింట రెండొంతుల మంది సంపన్నుల సంపద తగ్గింది.

అమెజాన్‌ షేర్లు 38 శాతం క్షీణించడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద 57 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది. గతేడాది ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన.. ఈ ఏడాది మూడో స్థానానికి చేరారు. ట్విటర్‌ కొనుగోలు తర్వాత ఎలాన్‌ మస్క్‌ సంపద 39 బిలియన్‌ డాలర్లు తగ్గి రెండో స్థానానికి వచ్చారు.

ఫ్రాన్స్‌ విలాస వస్తువుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 211 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్‌ (180 బి.డాలర్లు), బెజోస్‌ (114 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఫోర్బ్స్‌ 2023 జాబితాలో 169 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. 2022లో వీరి సంఖ్య 166గా ఉంది. కానీ వీరి సంపద మాత్రం 750 బి.డాలర్ల నుంచి 10% తగ్గి 675 బి.డాలర్లకు చేరింది.

హెచ్‌సీఎల్‌ టెక్‌ అధిపతి శివ్‌ నాడార్‌ సంపద 11% కోల్పోయి 25.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఆయన దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. సైరస్‌ పూనావాలా, లక్ష్మీ మిత్తల్‌, సావిత్రి జిందాల్‌, దిలీప్‌ సంఘ్వీ, రాధాకిషన్‌ దమానీ, కుమార్‌ బిర్లా, ఉదయ్‌ కోటక్‌ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు.

జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌, నితిన్‌ కామత్‌లు వరుసగా 1.1 బి.డాలర్లు, 2.7 బి.డాలర్ల సంపదతో జాబితాలో తొలిసారి స్థానం పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని