విల్మర్‌ సంయుక్త సంస్థ నుంచి అదానీ బయటకు?

ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుంచి గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ వైదొలగనున్నట్లు సమాచారం. సింగపూర్‌ సంస్థ విల్మర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ అదానీ విల్మర్‌లో తనకున్న పూర్తి వాటాను విక్రయించేందుకు దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Updated : 07 Nov 2023 03:57 IST

పూర్తి వాటా అమ్మకానికి యత్నాలు
ప్రధానేతర వ్యాపారాల నుంచి వైదొలిగేందుకే  
మౌలికం, ఇంధనంలో పెట్టుబడులపై దృష్టి

ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం నుంచి గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ వైదొలగనున్నట్లు సమాచారం. సింగపూర్‌ సంస్థ విల్మర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ అదానీ విల్మర్‌లో తనకున్న పూర్తి వాటాను విక్రయించేందుకు దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుణభారాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రధానేతర వ్యాపారాల నుంచి నిష్క్రమించి, తనకు ప్రధానమైన మౌలిక వసతులతో పాటు, ఇంధన వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, ఖాతాల్లోనూ పలు లోపాలున్నాయని హిండెన్‌బర్గ్‌ నివేదిక ఈ ఏడాది జనవరిలో ఆరోపించింది. ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలు భారీగా పతనమై, సంస్థ మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల షేర్ల విలువలు తిరిగి పెరిగినందున, ఆ నష్టాల్లో చాలా వరకు అదానీ గ్రూప్‌ పూడ్చుకోగలిగింది. కానీ హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావ ప్రకంపనల నుంచి పూర్తిగా బయట పడలేదు. అందుకే నిధుల సమీకరణ కోసం  అదానీ విల్మర్‌లో తనకున్న మొత్తం 43.97 శాతం వాటాను విక్రయించడం కోసం పలు బహుళజాతికంపెనీలతో అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతోందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి. సింగపూర్‌కు చెందిన విల్మర్‌ ఇంటర్నేషనల్‌కు కూడా అదానీ విల్మర్‌లో 43.87 శాతం వాటా ఉంది. ఈ విక్రయం ద్వారా కనీసం 2.5-3 బిలియన్‌ డాలర్ల మేర సమీకరించాలని అదానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక నెలలోగా ఒప్పందం జరగొచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా దీనిని ధ్రువీకరించలేదు.

ఇప్పటికే జీక్యూజీ పార్టనర్స్‌ ద్ద పెట్టుబడిదార్లను సంస్థ ఆకర్షించినా.. ఇంకా ద్రవ్యలభ్యత సవాళ్లయితే అదానీ గ్రూప్‌నకు ఉన్నాయి. అదానీ విల్మర్‌లో వాటా విక్రయం పూర్తయితే మరికొన్ని ప్రధానేతర కంపెనీల్లోనూ వాటా విక్రయాలకు గ్రూప్‌ సిద్ధం కావొచ్చని అంచనా.

మరో వైపు అంబానీ దూకుడు

ఐటీసీ, బ్రిటానియా, మారికో వంటి దేశీయ కంపెనీలు; యునిలీవర్‌, నెస్లే వంటి అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలతో పోటీ పడడానికి ఈ రంగంలోకి రిలయన్స్‌, టాటా, అదానీ అడుగుపెట్టారు. ఈ విభాగంలో రిలయన్స్‌ మాత్రం దూకుడును ప్రదర్శిస్తోంది. గతేడాది డిసెంబరులో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ పేరుతో రిలయన్స్‌ రిటైల్‌ తన ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదానీ విల్మర్‌కు చెందిన వంటనూనెలు, పప్పుధాన్యాలకు; పతంజలి ఫుడ్స్‌కు చెందిన బిస్కట్లు, వంటనూనెలు, గోధుమపిండికి; పార్లే, బ్రిటానియా బిస్కట్లకు; టాటా కన్జూమర్‌ పప్పు ధాన్యాలు, ప్యాకేజ్డ్‌ నీటికి; ఐటీసీకి చెందిన ప్యాకేజ్డ్‌ గోధుమ పిండి, బిస్కట్లకు పోటీగా రిలయన్స్‌ తన ‘ఇండిపెండెన్స్‌’ బ్రాండ్‌ను తెచ్చింది. అదానీ విల్మర్‌తో వంటనూనెల ధరలు, మార్కెట్‌ వాటా విషయంలో తీవ్ర పోటీకి రిలయన్స్‌ తెరలేపింది కూడా. మూడేళ్ల కిందట ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీని ఏర్పాటు చేసినప్పటి నుంచి టాటాలు కూడా కంపెనీల కొనుగోళ్లలో తగ్గట్లేదు. ఈ తీవ్ర పోటీలో, అదానీ ఈ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నారన్న వార్తలు రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని