అంకురాలకు సంబరమే

అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Updated : 02 Feb 2024 05:49 IST

మరో ఏడాది పాటు పన్ను ప్రయోజనాలు

దిల్లీ: అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. సావరిన్‌ వెల్త్‌ లేదా పింఛను ఫండ్‌ల పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలను 2025 మార్చి వరకు వర్తింపజేయనున్నారు. ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ)లోని కొన్ని యూనిట్లకు చెందిన నిర్దిష్ట ఆదాయంపై పన్ను మినహాయింపు ఈ ఏడాది మార్చి 31తో ముగియాల్సి ఉంది. 

ఎవరికి ప్రయోజనం..: ఇప్పటిదాకా 1.17 లక్షల అంకురాలను ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ స్టార్టప్‌ ఇండియాలోని ‘యాక్షన్‌ ప్లాన్‌’కింద పన్ను ప్రయోజనాలు అందుతాయి.

అంకురాలతో పాటు సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, ఐఎఫ్‌ఎస్‌సీలోని విమాన లీజింగ్‌ వ్యాపారాలు చేస్తున్న సంస్థలకూ ప్రయోజనం దక్కనుంది.


దుస్తుల ఎగుమతిదార్లకు 2026 వరకు ప్రోత్సాహకాలు

దుస్తులు ఎగుమతి చేసే వారికి ఉద్దేశించిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. ద రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ టాక్సెస్‌ అండ్‌ లెవీస్‌(ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌)గా పిలిచే ఈ పథకం ద్వారా రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాలకు పరిహారం ఇస్తారు. డ్యూటీ డ్రాబ్యాక్‌ పథకం కింద రిబేట్‌ కూడా ఇస్తారు. తొలుత ఈ పథకాన్ని 2020లో ప్రకటించారు. ఇంతకుముందు పొడిగించిన గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. తాజాగా ఇంకోసారి పొడిగింపును ప్రకటించారు.

ఎవరికి ప్రయోజనం: పరిశ్రమలోని సంస్థలు దీర్ఘకాల వాణిజ్య ప్రణాళిక రచించుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఎంత కేటాయింపులు: ఈ పథకానికి కేటాయింపులు 2023-24లో రూ.8404.66 కోట్లు కాగా, 2024-25 బడ్జెట్‌లో రూ.9,246 కోట్లకు పెంచారు.


ఎలక్ట్రానిక్స్‌ - సెమీకండక్టర్‌ రంగాలకు రూ.15,500 కోట్లు

దిల్లీ: సెమీకండక్టర్‌, మొబైల్‌, ఐటీ హార్డ్‌వేర్‌ పీఎల్‌ఐ పథకం లాంటి వివిధ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కార్యక్రమాలకు 2024-25లో రూ.15,500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌ ప్లాంట్ల ప్రోత్సాహాకానికి రూ.4,203 కోట్లు కేటాయించారు. గుజరాత్‌లో మైక్రాన్‌ ఏర్పాటు చేస్తున్న ప్లాంటు, ఫాక్స్‌కాన్‌ ప్లాంటు, హెచ్‌సీఎల్‌ సంయుక్త సంస్థ, టాటా గ్రూపు ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుంది. సెమీకండక్టర్‌, సెన్సార్‌ ప్లాంట్లకు కూడా ఈ కేటాయింపులు వర్తించనున్నాయి. మొత్తంమీద సెమీకండక్టర్‌ ప్లాంట్లకు రూ.6,903 కోట్లు లభిస్తాయి. మొబైల్‌ తయారీ ప్రోత్సాహకానికి పీఎల్‌ఐ పథకం కింద 2024-25లో రూ.6,125 కోట్లు, 2023-24లో రూ.4,489 కోట్లను కేటాయించనున్నారు. మొబైల్‌ పీఎల్‌ఐ పథకం కింద డిక్సన్‌, ఫాక్స్‌కాన్‌, ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌, లావా లాంటి కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.


వాహన రంగానికి ‘ఏడింతల’ సంతోషం

పీఎల్‌ఐ పథకానికి రూ.3,500 కోట్లు

దిల్లీ: వాహన, వాహన విడిభాగాల కంపెనీలకు ఉద్దేశించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద, 2024-25కు రూ.3,500 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా అయిన రూ.483.77 కోట్లతో పోలిస్తే ఇది ఏడింతలు కావడం విశేషం.
వీటికీ ఊతం: అధునాతన రసాయన బ్యాటరీ, బ్యాటరీ స్టోరేజీలకు వర్తించే పీఎల్‌ఐ పథకానికీ కేటాయింపులను గత బడ్జెట్‌లోని రూ.12 కోట్లతో పోలిస్తే రూ.250 కోట్లకు పెంచారు. 2023-24 నుంచి  అయిదేళ్ల పాటు వర్తించేలా ఇటీవలే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాహన పీఎల్‌ఐ పథకాన్ని పొడిగించింది.
ప్రయోజనం ఏంటి?: అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ(ఏఏటీ) ఉత్పత్తుల తయారీకి పీఎల్‌ఐ వాహన పథకం ఊతమిస్తుంది. ఏఏటీ ఉత్పత్తులను దేశీయంగా తయరు చేయడంతో పాటు అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.


పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు నిధులు

2070 కల్లా నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనీసం 1 గిగావాట్‌ సామర్థ్యం ఉన్న ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులకు ‘వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌’ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రవాణా, గొట్టపు గ్యాస్‌ అవసరాలకు వినియోగించే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(సీఎన్‌జీ)లో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌(సీబీజీ)ను దశల వారీగా కలపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2030 కల్లా హరిత ఇంధన వనరుల ఆధారిత విద్యుత్‌ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలన్న లక్ష్యానికీ భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

  •  2030 కల్లా 100 మెట్రిక్‌ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్‌ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సహజ వాయువు, మిథనాల్‌, అమ్మోనియా దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌ భావిస్తోంది.

ప్రభుత్వరంగ విద్యుత్‌ కంపెనీల పెట్టుబడులు రూ.67,286 కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 ప్రభుత్వ రంగ విద్యుత్‌ కంపెనీల పెట్టుబడులను రూ.67,286.01 కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ కంపెనీల పెట్టుబడులు రూ.59,119.55 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 14% పెరగనున్నాయి. పవర్‌గ్రిడ్‌ పెట్టుబడులు రూ.8,800 కోట్ల నుంచి రూ.12,250 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్‌జేవీఎన్‌ పెట్టుబడులను రూ.12,000 కోట్లకు, ఎన్‌హెచ్‌పీసీ రూ.11,761.87 కోట్లకు, ఎన్‌టీపీసీ రూ.22,700 కోట్లకు, దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ రూ.3,262 కోట్లకు, నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ రూ.1,841.18 కోట్లకు, తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులను రూ.3,440.96 కోట్లకు పెంచాలని భావిస్తున్నారు. 2023-24 బడ్జెట్‌లో విద్యుత్‌ కంపెనీల వార్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని రూ.60,805.22 కోట్లుగా పెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని