నిర్మలమ్మ రికార్డు బడ్జెట్‌ ఇది!

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు.

Updated : 02 Feb 2024 05:45 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. అయిదు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తన సీనియర్‌లు మన్మోహన్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హాలను ఆమె అధిగమించారు. దేశానికి తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా ఇప్పటికే రికార్డు సృష్టించిన నిర్మల.. 2019లో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల తర్వాత వచ్చిన ‘మోదీ 2.0’ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ పగ్గాలు నిర్మలా సీతారామన్‌ చేపట్టారు. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. ఇందిరాగాంధీ 1970-71లో పద్దు సమర్పించారు. ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌గా పిలిచే ప్రస్తుత పద్దులో రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల వ్యయాలను పేర్కొని, పార్లమెంటు ఆమోదం పొందారు. ఏప్రిల్‌ లేదా మే తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని