ఉత్పత్తి రంగంలో...

నవీ మ్యూచువల్‌ ఫండ్‌ మన దేశంలో ఉత్పత్తి రంగానికి చెందిన అగ్రశ్రేణి కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో ‘నవీ నిఫ్టీ ఇండియా మ్యానుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. కనీస పెట్టుబడి

Published : 12 Aug 2022 00:37 IST

నవీ మ్యూచువల్‌ ఫండ్‌ మన దేశంలో ఉత్పత్తి రంగానికి చెందిన అగ్రశ్రేణి కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో ‘నవీ నిఫ్టీ ఇండియా మ్యానుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ ఇండియా మ్యానుఫాక్చరింగ్‌ టీఆర్‌: సూచీని ఈ పథకానికి కొలమానంగా తీసుకుంటారు.   ఈ సూచీలో ప్రస్తుతం 79 కంపెనీలున్నాయి. ఇందులో క్యాపిటల్‌ గూడ్స్‌, వాహన, ఆరోగ్య సంరక్షణ, లోహాలు, రసాయనాలు- ఫార్మా రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలున్నాయి. ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలకు ఈ పథకం దాదాపు 95 శాతం నిధులను ఈక్విటీ షేర్లకు కేటాయిస్తుంది. రుణ పత్రాలకు 5 శాతం వరకూ నిధులు కేటాయించవచ్చు. నిఫ్టీ 100, నిఫ్టీ 150, నిఫ్టీ 50 సూచీల్లోని ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీల పనితీరును విశ్లేషించి, తన పెట్టుబడుల విధానానికి సరిపోయిన కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టడం ఈ పథకం లక్ష్యం.  

మౌలిక కంపెనీల్లో
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా నిఫ్టీ ఈటీఎఫ్‌ పథకం వచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈటీఎఫ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 17. కనీస పెట్టుబడి రూ.1,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ప్యాసివ్‌ పథకం. ఫండ్‌ మేనేజర్‌ విచక్షణకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ పథకం నిబంధనల ప్రకారం పోర్ట్‌ఫోలియోను నిర్మించాలి. మనదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున నూతన అవకాశాలు లభిస్తాయనే నమ్మకం, తద్వారా ఈ రంగానికి చెందిన కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తాయనే విశ్వాసం ఉన్న మదుపరులు ఈ ఫండ్‌ పథకాన్ని పెట్టుబడి కోసం పరిశీలించవచ్చు. నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సూచీలో టెలీకామ్‌, పవర్‌, పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, షిప్పింగ్‌ ప్రాజెక్టులు నిర్వహించే కంపెనీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని