వృథా ఖర్చులకు వేద్దాం కళ్లెం..

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వడ్డీ రేట్లు పెరగడంతో రుణాలు భారం అవుతున్నాయి. వాయిదాల చెల్లింపు వ్యవధి ఏళ్లకు ఏళ్లు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

Updated : 17 Mar 2023 10:33 IST

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వడ్డీ రేట్లు పెరగడంతో రుణాలు భారం అవుతున్నాయి. వాయిదాల చెల్లింపు వ్యవధి ఏళ్లకు ఏళ్లు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్‌ లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందనేది విస్మరించలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించే విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.

చ్చిన ఆదాయంలో నుంచి ముందుగా పొదుపు చేయండి. ఆ తర్వాతే ఖర్చు చేయండి’... వారెన్‌ బఫెట్‌ చెప్పిన ఈ మాట ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకం. నెల ప్రారంభంలో ప్రతి ఒక్కరి ఖాతాలోనూ బ్యాలెన్స్‌ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఖర్చు చేసేందుకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ ఉండదు. కానీ, నెలాఖరుకు వచ్చే నాటికి చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రతి రూపాయికీ తడుముకోవాల్సి వస్తుంది. వృథా ఖర్చు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. కాస్త ఆలోచిస్తే ఆ మొత్తం భవిష్యత్‌కు భరోసానిచ్చేదిగా మారొచ్చు. సందర్భానుసారం చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వాటిని కాదనలేం. కానీ, కేవలం డబ్బు ఉంది కదా.. ఖర్చు చేద్దాం అనే ధోరణే ప్రమాదం.

ఖర్చులపై నియంత్రణ సాధించేందుకు సులువైన మార్గం.. ఎక్కడ వృథా అవుతోందో కనిపెట్టడమే. అప్పుడే వ్యయాలు తగ్గి, పొదుపు పెరుగుతుంది.

భావోద్వేగాల అదుపు : అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. జీవన శైలిని నిర్వహించేందుకు ఎక్కువగా డబ్బును కేటాయిస్తుంటారు. ఇది సాధారణ విషయంగానే అనుకున్నా.. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించడం ప్రారంభించాలి. అతిగా ఖర్చు చేయాలి అనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఈ స్నేహితులు ఎలా ఖర్చు చేస్తున్నారు, వారి డబ్బు నిర్వహణ ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించండి.    

బడ్జెట్‌ నిర్వహణ.. : ప్రతి ఒక్కరికీ ఖర్చు ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, ఖర్చులను సరిగ్గా నిర్వహించేందుకు బడ్జెట్‌ వేసుకోవాలి. వచ్చిన ఆదాయంలో నుంచి 20 శాతం పొదుపు, 30-50 శాతం నెలవారీ అవసరాలకు కేటాయించాలి. 40 శాతానికి మించి రుణ వాయిదాలు లేకుండా చూసుకోవాలి. ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను కేవలం ఖర్చుల కోసమే కేటాయించాలి. దీనివల్ల ఖర్చులకు ఒక కచ్చితమైన లెక్క దొరుకుతుంది. ఏదైనా కొనాలనుకున్నా, విహార యాత్రలకు వెళ్లినా అన్నీ మీ బడ్జెట్‌లోనే ఉండేలా జాగ్రత్త తీసుకోండి. లేకపోతే.. మీ పొదుపు మొత్తం తగ్గి, భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది.

కార్డుపై పరిమితి.. : నగదుతో అవసరం లేకుండా.. క్రెడిట్‌ కార్డును వాడటం సౌకర్యవంతంగానే ఉంటుంది. కానీ, దీన్ని వాడటంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.పరిమితి ఉంది కదా అని ఆ మేరకు ఖర్చు చేస్తే, తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. చాలామంది తమ నెలవారీ ఖర్చు ఎంత? అనే విషయంలో సరైన అవగాహన ఉండదు.  అవసరం వచ్చినప్పుడు కార్డును వాడటం, ఆ తర్వాత బిల్లు చెల్లించలేక ఇబ్బంది పడటం తరచూ చూస్తుంటాం. క్రెడిట్‌ కార్డు ఆర్థిక వెసులుబాటును ఇస్తుంది. కానీ, నియంత్రణ లేని ఖర్చు వల్ల చిక్కులు ఎదురవుతాయి. మీ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకపోవమే ఉత్తమం.

వాయిదా వేయండి.. : కొన్ని ఖర్చులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకున్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. మీరు కొనాలనుకున్న వస్తువుల్లో ఇలా తర్వాత తీసుకోవచ్చు అనేవి ఉన్నప్పుడు దాన్ని వాయిదా వేసుకోవచ్చు. దీనివల్ల మీ అధిక వ్యయాలను నియంత్రించుకునే అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు వాయిదా పద్ధతిలో వస్తువులు కొంటుంటారు. ఇదీ అంత మంచిదేమీ కాదు. దీనికి బదులుగా చెల్లించాల్సిన వాయిదాలను రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకొని, ఆ మొత్తం జమయ్యాకే వస్తువులను కొనడం మంచిది.  

ఖాతా నుంచే నేరుగా.. : మీరు పెట్టే పెట్టుబడులన్నింటికీ ఆటో డెబిట్‌ ఆప్షన్‌ను వినియోగించుకోండి. దీనికోసం మరో ప్రత్యేక ఖాతా ఉండాలి. మీ జీతం ఖాతాలో జమైన రోజే ఈ ఖాతాలోకి     ఆ మొత్తం వెళ్లిపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే పెట్టుబడి పథకాల్లోకి చేరాలి. ఈ పెట్టుబడి ఖాతాకు యూపీఐ యాప్‌లను అనుసంధానించకండి. దీనివల్ల పెట్టుబడి మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉండవు. నెల మధ్యలో బిల్లుల చెల్లింపు, పెట్టుబడి పథకాలకు డబ్బు వెళ్లిందా లేదా  గమనించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు