ఆకర్షణీయమైన లాభాల కోసం..

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘మిరే అసెట్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌’ను తీసుకొచ్చింది. ఇది లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మదుపు చేసే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 11తో ముగుస్తుంది.

Published : 04 Aug 2023 00:31 IST

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘మిరే అసెట్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌’ను తీసుకొచ్చింది. ఇది లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మదుపు చేసే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 11తో ముగుస్తుంది. అంకిత్‌ జైన్‌ ఫండ్‌ మేనేజర్‌. నిఫ్టీ మల్టీ క్యాప్‌ 50:25:25 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 మదుపు చేయాలి. ప్రతి విభాగంలో కనీసం 25 శాతం, గరిష్ఠంగా 50 శాతం వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నందున మల్టీక్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి ఆకర్షణీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. లార్జ్‌ క్యాప్‌ షేర్లపై పెట్టుబడి కోసం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం టాప్‌-100 జాబితాలో ఉన్న షేర్లను ఎంచుకుంటారు. ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ, పెట్టుబడుల ఎంపిక, సక్సెస్‌ రేటుపై లాభాలు ఆధారపడి ఉంటాయి. కాకపోతే లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లకు పెట్టుబడుల కేటాయింపు అధికంగా ఉంటుంది. కాబట్టి, ఫండ్‌ విలువలో హెచ్చుతగ్గులు పరిమితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ పథకం రెగ్యులర్‌ ప్లాన్‌, డైరెక్ట్‌ ప్లాన్‌లలో అందుబాటులో ఉంది.


ఉత్పత్తి రంగంలో...

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సెక్టోరియల్‌/థీమ్యాటిక్‌ విభాగానికి చెందిన ‘క్వాంట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 8తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. మనదేశం ప్రపంచంలోని అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటి. వచ్చే పదేళ్లలో ఇంకా వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్పత్తి రంగం అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుందని అంచనా. అంటే ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆయా కంపెనీల షేర్ల ధరలు అనూహ్యమైన స్థాయికి పెరిగి, మదుపరులకు లాభాల పంట పండిస్తాయి. ఈ మార్పుపై విశ్వాసం ఉన్న మదుపరులు క్వాంట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌పై పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు. ఈ ఫండ్‌ ప్రధానంగా ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీల్లో వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న కంపెనీలను గుర్తించి వాటిపై పెట్టుబడి పెడుతుంది. తద్వారా మదుపరులకు అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంది. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించటానికి ఇష్టపడే మదుపరులకు ఇది అనువుగా ఉంటుంది. 


క్యాన్సర్‌ బాధితులకు చేయూత...

ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ‘హెచ్‌డీఎఫ్‌సీ ఛారిటీ ఫండ్‌ ఫర్‌ క్యాన్సర్‌ క్యూర్‌’ అనే పేరుతో ఆవిష్కరించింది. ఇది 1,196 రోజుల కాల పరిమితి ఉన్న క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీ సహకారంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 8. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.50,000. ఈ పథకం నుంచి వచ్చిన లాభాల్లో 50 శాతం నుంచి 75 శాతాన్ని ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలా చేయటానికి ఐడీసీడబ్ల్యూ (ఇన్‌కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ క్యాపిటల్‌ విత్‌డ్రాయల్‌) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. క్యాన్సర్‌ బాధితులకు తమ వంతుగా సేవ చేద్దామనుకునే వ్యక్తులు, సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టి ఐడీసీడబ్ల్యూ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. కాలపరిమితి పూర్తయిన తర్వాత అసలు మొత్తాన్ని, లాభాల్లో ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీకి డొనేషన్‌ ఇవ్వగా మిగిలిన సొమ్మును మదుపరులకు తిరిగి ఇస్తారు. మదుపరులు ఇచ్చిన సొమ్ముకు సరిసమాన మొత్తాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తన వంతుగా ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీకి ఇస్తుంది. ఈ మొత్తం ఒక ఏడాదిలో రూ.16 కోట్లకు మించకుండా ఉంటుంది. ఇటీవల కాలంలో క్యాన్సర్‌ కేసులు ఎంతగానో పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి అయ్యే చికిత్స ఖర్చును భరించటం, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సాధ్యం కాదు. చికిత్స ఖర్చును భరించలేక ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అటువంటి వారికి తమ వంతుగా ఎంతోకొంత మేరకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ వినూత్నమైన పథకాన్ని ఆవిష్కరించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని