Mutual Funds: కొత్త పథకాల జోరు..

కొత్త పథకాలతో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు  మదుపరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పలు వైవిధ్యమైన పథకాలు ఉంటున్నాయి. కొన్ని సూచీ ఫండ్లను ఆవిష్కరిస్తే..

Updated : 19 Jan 2024 10:35 IST

కొత్త పథకాలతో మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) సంస్థలు  మదుపరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పలు వైవిధ్యమైన పథకాలు ఉంటున్నాయి. కొన్ని సూచీ ఫండ్లను ఆవిష్కరిస్తే.. మరికొన్ని థీమ్యాటిక్‌ పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన పలు ఫండ్లను పరిశీలిద్దాం..


వైట్‌వోక్‌ క్యాపిటల్‌.. రెండు పథకాలు

వైట్‌వోక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) నుంచి ఒకేసారి రెండు కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి వైట్‌వోక్‌ క్యాపిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌, మరోటి వైట్‌వోక్‌ క్యాపిటల్‌ ఫార్మా అండ్‌ హెల్త్‌ కేర్‌ ఫండ్‌. ఈ రెండూ థీమ్యాటిక్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలు కావటం ప్రత్యేకత. ఈ రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 30. బ్యాంకింగ్‌ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.100. హెల్త్‌కేర్‌ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.500. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగానికి చెందిన కంపెనీల్లో మదుపు చేసి లాభాలు ఆర్జించడం వైట్‌వోక్‌ క్యాపిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ ప్రధాన వ్యూహం. అదే విధంగా ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన కంపెనీలపై వైట్‌వోక్‌ క్యాపిటల్‌ ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ 50 వాల్యూ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 29. కనీస పెట్టుబడి రూ.100. నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ సూచీలోని కంపెనీలపైనే ప్రధానంగా ఈ పథకం పెట్టుబడి పెడుతుంది. ఇవన్నీ బ్లూచిప్‌ కంపెనీలే కావటం ప్రత్యేకత. రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయ్డ్‌ (ఆర్‌ఓసీఈ), పీఈ నిష్పత్తి, ప్రైస్‌ టు బుక్‌ వ్యాల్యూ నిష్పత్తి, డివిడెండ్‌ ఈల్డ్‌.. తదితర వివిధ ప్రమాణాలను విశ్లేషించి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేస్తారు. గత ఏడాది, మూడేళ్లు, అయిదేళ్ల కాలంలో నిఫ్టీ 50 సూచీ కంటే నిఫ్టీ 20 టీఆర్‌ఐ సూచీ అధిక వృద్ధిని నమోదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అందువల్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.


ప్రభుత్వ బ్యాంకుల్లో...

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) నుంచి ఎక్స్ఛేంజ్‌ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) ఒకటి కొత్తగా అందుబాటులోకి వస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. దీర్ఘకాలం పాటు మదుపు చేయాలనుకునే వారికి ఇది అనువుగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఈ పథకం పెట్టుబడులు ఉంటాయి.


మిరే అసెట్‌ నుంచి..

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) ఒక నూతన మల్టీ అసెట్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. మిరే అసెట్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 24. ఇది హైబ్రిడ్‌ తరగతికి చెందిన పథకం. ఈక్విటీ షేర్లతోపాటు, రుణ పత్రాలు, బంగారం-వెండి ఈటీఎఫ్‌లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ కమొడిటీ డెరివేటివ్స్‌లలో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. విభిన్నమైన పెట్టుబడి పత్రాలపై పెట్టుబడులు ఉండాలనుకునే మదుపరులకు ఇది అనుకూలం.


ఎస్‌బీఐ నిఫ్టీ 50..

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నిఫ్టీ 50లోని షేర్లపై పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే ఇండెక్స్‌ ఫండ్‌ను రూపొందించింది. ఎస్‌బీఐ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 29. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోర్ట్‌ఫోలియో ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలంలో నష్టభయం తక్కువగా ఉంటుంది.


మోతీలాల్‌ ఓస్వాల్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌

ఒక లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ కొత్తగా మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి అందుబాటులోకి వస్తోంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ అనే ఈ పథకం ప్రధానంగా పెద్ద కంపెనీలపైన మాత్రమే పెట్టుబడి పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం కావటం ప్రత్యేకత. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 31. ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పోర్ట్‌ఫోలియోలో 80 శాతం వరకూ ‘నిఫ్టీ 100 లార్జ్‌ క్యాప్‌’ కంపెనీలే ఉంటాయి. మిగిలిన 20 శాతం కోసం, మిడ్‌/ స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కనబరుస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న కంపెనీలు (ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందినవి...) మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అందువల్ల లార్జ్‌ క్యాప్‌ పథకాల్లో మదుపరులకు లాభాలు వచ్చే వీలు కనిపిస్తోంది.


బంధన్‌ మ్యూచువల్‌..

బంధన్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ అనే  కొత్త పథకాన్ని బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) తీసుకొచ్చింది. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ  నెల 24. కనీస పెట్టుబడి రూ.1,000. అన్ని  తరగతులకు చెందిన పెట్టుబడి పత్రాలపై (ఈక్విటీ, రుణ పత్రాలు, బంగారం, వెండి తదితరాలు...) ఇది పెట్టుబడులు పెడుతుంది. తద్వారా తక్కువ రిస్కుతో స్థిరమైన లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని