పెట్టుబడులు.. 30 కంపెనీల్లో...

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కేంద్రీకృత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

Updated : 02 Jun 2023 02:20 IST

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కేంద్రీకృత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐటీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 12. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి ధీమంత్‌ షా, రోహన్‌ కోర్డే ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా పరిగణిస్తారు. ఇది ఫోకస్డ్‌ ఫండ్‌ తరగతికి చెందిన పథకం కాబట్టి, దీని పోర్ట్‌ఫోలియోలో కంపెనీల సంఖ్య 30కి మించకపోవచ్చు. దీర్ఘకాలం పాటు మదుపరులు ఇలాంటి పథకాల్లో మదుపు కొనసాగిస్తే నిఫ్టీ 50 సూచీ స్థాయిలో లేదా అంతకంటే కొంత అధికంగా ప్రతిఫలాన్ని సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు చెందిన ఫోకస్డ్‌ ఫండ్‌ పథకాలు మదుపరులకు అందుబాటులో ఉన్నాయి. గత అయిదేళ్ల కాలంలో ఈ పథకాలు సగటున 12 నుంచి 15 శాతం వరకూ వార్షిక ప్రతిఫలాన్ని నమోదు చేశాయి. ఇదే స్థాయి రాబడి భవిష్యత్తులోనూ వస్తుందనే హామీ లేదు. మొత్తంగా చూస్తే.. తక్కువ నష్టభయం, ఆకర్షణీయమైన ప్రతిఫలం ఈ పథకం నుంచి ఆశించవచ్చు.


వెండిలో పరోక్షంగా

మిరే అసెట్‌ మ్యూచవల్‌ ఫండ్‌ వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరుల కోసం సిల్వర్‌ ఈటీఎఫ్‌ పథకాన్ని    ఆవిష్కరించింది. మిరే అసెట్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 6న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి రితేశ్‌ పటేల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. వెండి ధర హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ పథకంలో మదుపరులకు లాభాలు కనిపించే అవకాశం ఉంటుంది. వెండి వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. ఒకవైపు పారిశ్రామిక అవసరాలు, మరోవైపు ఫ్యాషన్‌, ఆభరణాల కోసం వెండిని అధికంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు రూ.70,000 దరిదాపుల్లో ఉన్న ఒక కిలో వెండి ధర, వచ్చే కొన్నేళ్లలో రూ.1 లక్షకు మించిపోతుందనే అంచనాలున్నాయి. గత అయిదేళ్లలో వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి ఏటా దాదాపు 13 శాతం రాబడి కనిపించింది. నిఫ్టీ 50 సూచీ కంటే ఇది స్వల్పంగా అధికం. వెండిని నేరుగా కొనుగోలు చేస్తే అమ్మడం కొంత కష్టం. అందువల్ల కేవలం వెండిపై పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరులకు మిరే అసెట్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ వంటి పథకాలు అనువుగా ఉంటాయి.


మధుమేహం ఉన్నా టర్మ్‌ పాలసీ

మధుమేహంతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేకంగా టర్మ్‌ బీమా పాలసీని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ముందస్తు మధుమేహంగల వారూ, టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ‘బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ డయాబెటిక్‌ టర్మ్‌ ప్లాన్‌ సబ్‌ 8 హెచ్‌బీఏ1సీ’ ని 30-60 ఏళ్ల వారు తీసుకునేందుకు వీలుంది. 5-25 ఏళ్ల వ్యవధికి పాలసీని ఎంచుకోవచ్చు. కనీసం రూ.25 లక్షల నుంచి ఎంత మొత్తానికైనా పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియాలు నెలనెలా లేదా మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి చెల్లించవచ్చు. ఇది పూర్తిగా రక్షణకే పరిమితమైన పాలసీ. కాబట్టి, వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడికి ప్రీమియం వెనక్కి రాదు. ఎలాంటి స్వాధీన విలువా ఉండదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, హెచ్‌బీఏ1సీ స్థాయి తదితరాలను బట్టి, ప్రీమియం ఆధారపడి ఉంటుంది. 35 ఏళ్ల పొగతాగని వ్యక్తి రూ.50 లక్షల విలువైన పాలసీని, 10 ఏళ్ల వ్యవధికి తీసుకుంటే.. రూ.11,802 ప్రీమియం ఉంటుందని బీమా సంస్థ చెబుతోంది. 20 ఏళ్లకు తీసుకుంటే రూ.14,887 చెల్లించాలి. మధుమేహాన్ని నియంత్రించుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకునే వారిని ప్రోత్సహించేందుకు పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలో 10 శాతం రాయితీని అందిస్తుంది. జీవన శైలి వ్యాధులు పెరుగుతున్నాయి. మధుమేహం బాధితులకు టర్మ్‌ బీమా పాలసీ అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఇలాంటి వారికోసం టర్మ్‌ పాలసీని తీసుకొచ్చామని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ తరుణ్‌ ఛుగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని