కొత్త కారు కొంటున్నారా?

పండగల వేళ కొత్త కారు కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. వాహన సంస్థలూ ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి.

Updated : 13 Oct 2023 07:20 IST

పండగల వేళ కొత్త కారు కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. వాహన సంస్థలూ ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి. బ్యాంకులూ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తూ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొత్త కారు కొనేందుకు రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం..

కారు రుణం తీసుకోవడానికి ఇప్పుడు పెద్దగా ఇబ్బందులేమీ ఉండటం లేదు. నచ్చిన కారు కొనడానికి వెళ్తే చాలు.. అక్కడున్న సిబ్బందే అంతా చూసుకుంటారు. కానీ, కొంత మనకూ అవగాహన ఉండాలి.

మీ బ్యాంకును అడగండి.. మీకు వేతనం ఖాతా ఉన్న బ్యాంకును ముందుగా సంప్రదించండి. మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు తదితరాల ఆధారంగా బ్యాంకు ముందుగానే మీకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి నెట్‌బ్యాంకింగ్‌, బ్యాంక్‌ యాప్‌ను పరిశీలించండి. అవసరమైతే బ్యాంకు శాఖకు వెళ్లండి. మీకు ముందే రుణం మంజూరైతే కారు కొనడం చాలా తేలిక అవుతుంది. అనవసర జాప్యాలు, దరఖాస్తులవంటివి ఉండవు. కేవలం ఒకటి రెండు ఓటీపీలతో రుణ ప్రక్రియ పూర్తయిపోతుంది. కారు డీలర్‌ వివరాలను బ్యాంకుకు అందిస్తే సరిపోతుంది. ఇప్పుడు చాలా షోరూముల్లో బ్యాంకు ప్రతినిధులు ఉంటారు. కాబట్టి, వారిని సంప్రదించినా పని తేలిక అవుతుంది.

రాయితీలను చూడండి.. మీకు ఖాతా ఉన్న బ్యాంకు వడ్డీ రేటు అధికంగా విధిస్తే.. మరో బ్యాంకును ప్రయత్నించండి. ఇప్పుడు చాలా బ్యాంకులు పండగల ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. పరిశీలనా రుసుము రద్దు, పరిమితకాలం పాటు వడ్డీ తగ్గింపులాంటివి ఉన్నాయి. వీటి గురించి ఒకసారి తనిఖీ చేయండి. బ్యాంకు ప్రతినిధులతో చర్చించండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందడుగు వేయండి.

ఇప్పటికే రుణాలు ఉంటే.. వాహన రుణానికి చెల్లించే వడ్డీకి ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఉండవు. ఇప్పటికే మీకు గృహరుణం లాంటివి ఉంటే, వాటిపై టాపప్‌ తీసుకునే వీలుందా పరిశీలించండి. వాహన రుణంతో పోలిస్తే వీటికి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఈ రుణాలు మీకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. వీలును బట్టి, త్వరగా తీర్చేసేందుకూ వీలుంటుంది. కాబట్టి, ఈ అంశాన్నీ ఒకసారి పరిశీలించి చూడండి.
స్కోరు మాటేమిటి? మీరు కారు రుణం కోసం వెళ్లే ముందు ఒకసారి మీ క్రెడిట్‌ స్కోరును తెలుసుకోండి. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. స్కోరు తగ్గితే వడ్డీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముందుగానే స్కోరును తెలుసుకుంటే, చివరి నిమిషంలో ఆందోళన ఉండదు. మీ స్కోరు మరీ తక్కువగా ఉంటే రుణం కోసం కొన్నాళ్లు ఆగాల్సిందే.  
చిన్న అప్పులను తీర్చేయండి.. కారు రుణం తీసుకున్న వెంటనే ఈఎంఐ ప్రారంభమవుతుంది. కాబట్టి, కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాల్లాంటివి ఉంటే తీర్చేయడం మేలు. లేకపోతే మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న రుణాలు అధికంగా ఉంటే.. అనుకున్నంత రుణం రాకపోవచ్చు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ వీటిని వదిలించుకోవడమే మేలు.

అన్ని పత్రాలూ సిద్ధంగా.. బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ఆదాయం, వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణలు సిద్ధంగా ఉంచుకోవాలి. రెండేళ్ల ఐటీ రిటర్నులు, 3-6 నెలల వేతనం వివరాలు అడిగే అవకాశాలున్నాయి. వ్యాపారులైతే చెల్లించిన జీఎస్‌టీ వివరాలను కోరవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు కారు ఆన్‌రోడ్‌ ధరలో 100 శాతం రుణాన్ని ఇస్తున్నాయి. మీకు అవసరమైనంత మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది. ముందస్తు చెల్లింపు, ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బునూ చేతిలో ఉంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని