8 ఏళ్లలో రూ.45లక్షలు..

నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి?

Published : 16 Feb 2024 00:22 IST

* నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? యులిప్‌లు తీసుకుంటే రాబడి బాగుంటుందా?

 ప్రశాంత్‌

ముందుగా మీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలకు తగిన రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ బీమా పాలసీని ఎంచుకోండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థలను ఎంచుకొని, బీమా పాలసీని తీసుకోవాలి. సంప్రదాయ పాలసీలతో పోలిస్తే యులిప్‌లో దీర్ఘకాలంలో రాబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. కానీ, రుసుములు ఉంటాయి. ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. యులిప్‌లతో పోలిస్తే వీటిలో రుసుములు తక్కువ. వెంటనే నగదుగా మార్చుకునే వీలూ ఉంటుంది.


 * మా అబ్బాయి ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్ల తర్వాత కనీసం రూ.45 లక్షలు అవసరం అవుతాయని అనుకుంటున్నాను. ఇందుకోసం నేను నెలకు ఎంత మొత్తం జమ చేయాలి? మంచి లాభాల కోసం షేర్లలో మదుపు చేయొచ్చా?

 సాయి
ఎనిమిదేళ్ల తర్వాత రూ.45 లక్షలు కావాలంటే.. ఇప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయాల్సి ఉంటుంది. 12 శాతం రాబడినిచ్చే పథకాలను ఇందుకోసం ఎంచుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌పై మంచి అవగాహన, ధరలను నిరంతరం గమనించే సమయం ఉంటేనే షేర్లలో మదుపు చేయాలి. లేకపోతే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, పెట్టుబడి పెట్టండి. డబ్బు రెండేళ్ల ముందు నుంచే ఈక్విటీల్లో నుంచి సురక్షిత పథకాల్లోకి డబ్బును మళ్లించండి.


* నా వయసు 68. నా దగ్గర ఉన్న రూ.4 లక్షలను నెలనెలా వడ్డీ వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి? నెలకు కనీసం రూ.4 వేలు వచ్చే అవకాశం ఉందా?

మోహన్‌
 రూ.4లక్షలపై నెలకు రూ.4వేల వడ్డీ రావాలంటే.. మీ పెట్టుబడిపై 12 శాతం రాబడి అందాలి. నష్టభయం లేని పెట్టుబడుల్లో 12 శాతం రాబడిని ఆశించలేం. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. సీనియర్‌ సిటిజెన్లకు 8 శాతం వరకూ కొన్ని బ్యాంకులు వడ్డీనిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంనూ పరిశీలించండి. ఇందులో 8.2 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు.

 నాలుగేళ్ల తర్వాత బంగారం కొనాలి. ఇందుకోసం ఇప్పటి నుంచి నెలకు రూ.25వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇందుకోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- మాధవి

* మొత్తం పెట్టుబడిని బంగారం కొనేందుకే ఉపయోగిస్తే.. గోల్డ్‌ ఫండ్లు లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేయొచ్చు. ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్‌ ఖాతా అవసరం. రూ.15వేలను గోల్డ్‌ ఫండ్ల కోసం కేటాయించండి. రూ.10వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని