ప్రీమియం వెనక్కి ఆ పాలసీలు మంచివేనా?

మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకున్నాను.

Published : 25 Jun 2022 17:38 IST

మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50లక్షల విలువైన టర్మ్‌ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?

- మధు

బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ టర్మ్‌ పాలసీని ఇస్తాయి. మీకు ఇప్పటికే రూ.50లక్షల పాలసీ ఉందంటున్నారు. కాబట్టి, మీకు ఎంత మేరకు అర్హత ఉందో చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయండి. మంచి క్లెయిం సెటిల్‌మెంట్‌ ఉన్న సంస్థను ఎంపిక చేసుకోండి. ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల్లో సాధారణ టర్మ్‌ పాలసీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. ఇలా వసూలు చేసిన అధిక ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత పాలసీదారులకు ఇస్తాయి. సాధారణ టర్మ్‌ బీమా, ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్‌ పాలసీల మధ్య ఉన్న ప్రీమియం వ్యత్యాసాన్ని మీరు సొంతంగానూ మదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అధిక మొత్తమే చేతికందే అవకాశం ఉంది.


స్టాక్‌ మార్కెట్లో మ్యూచువల్‌ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?

- శ్రీధర్‌

మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 20శాతం వరకూ ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. మిగతా మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో కొనసాగించండి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌లలో ఖర్చుల నిష్పత్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితుల్లో ఈటీఎఫ్‌ల పనితీరు బాగానే ఉంది. స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసినప్పుడు నష్టభయం సహజమే. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడు, నష్టభయం తగ్గి, మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.


నా యవసు 27. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.27వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలను ఏదైనా పెట్టుబడికి కేటాయించాలని అనుకుంటున్నాను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- నాగేంద్ర

మీపైన ఆధారపడిన వారు ఉంటే కనీసం రూ.35లక్షల మేరకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు మర్చిపోవద్దు. ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోండి. రూ.10వేలలో రూ.7వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి. మిగతా రూ.3వేలను పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయండి. దీనివల్ల దీర్ఘకాలంలో మీకు మంచి మొత్తం సమకూరుతుంది.


మా అమ్మాయి పేరు మీద నెలకు రూ.5వేలను సుకన్య సమృద్ధిలో జమ చేయాలని అనుకుంటున్నాం. దీనికన్నా అధిక రాబడి వచ్చే పథకం ఏదైనా ఉందా?

- పావని

అమ్మాయిల భవిష్యత్‌ అవసరాలకు డబ్బును పెట్టుబడి పెట్టేందుకు సురక్షిత పథకం సుకన్య సమృద్ధి యోజన. దీన్ని 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరుమీద ప్రారంభించే వీలుంది. ప్రస్తుతం 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. సురక్షిత పథకాల్లో ఇదే అధిక రాబడిని అందిస్తోంది. చెల్లించిన మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి రాదు. కాస్త అధిక రాబడిని ఆశిస్తే.. రూ.3వేలను సుకన్య సమృద్ధిలో జమ చేయండి. మిగతా రూ.2వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు