కొత్త పాలసీ.. టాపప్‌ ఏది మేలు?

నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 45. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? నాకు నెలకు రూ.75 వేలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త తీసుకోబోయే పాలసీకి ప్రీమియం వెనక్కి వచ్చేలా ఎంచుకోవచ్చా?

Updated : 23 Jun 2023 06:00 IST

నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో రూ.50 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 45. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? నాకు నెలకు రూ.75 వేలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త తీసుకోబోయే పాలసీకి ప్రీమియం వెనక్కి వచ్చేలా ఎంచుకోవచ్చా?

పాండు

బీమా సంస్థలు సాధారణంగా పాలసీదారుడి వయసును బట్టి, వార్షికాదాయానికి 10-22 రెట్ల వరకూ బీమాను అందిస్తాయి. ఈ లెక్కన చూసినప్పుడు మీరు అదనంగా మరో రూ.50లక్షల పాలసీని తీసుకునేందుకు ఇబ్బందేమీ లేదు. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీకి సంబంధించిన వివరాలు, ఆదాయం, ఆరోగ్యం సమాచారాన్ని తెలియజేయాలి. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలు కాస్త ఖరీదెక్కువ. కాబట్టి, దానికి బదులు సాధారణ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీనే తీసుకోండి. చెల్లింపుల చరిత్ర సరిగా ఉన్న కంపెనీ నుంచి బీమా పాలసీని తీసుకోండి.


మా అమ్మాయి వయసు 10. తన పేరు మీద నెలకు రూ.15వేల వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాం. 10 ఏళ్ల పాటు మదుపు చేసేందుకు అనువైన పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమ అవుతుంది?

శ్రావణి

ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఎక్కడ మదుపు చేసినా.. దీనికి మించి రాబడి వచ్చేలా చూసుకోండి. ఇందుకోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. నెలకు రూ.15వేల చొప్పున 10 ఏళ్లపాటు 12 శాతం సగటు రాబడి అంచనాతో మదుపు చేస్తే.. దాదాపు రూ.31,58,772 అయ్యేందుకు అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేముందు పాప భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం టర్మ్‌ పాలసీని తీసుకోండి.


రెండేళ్లలో సొంతిల్లు కొనాలనే ఆలోచన ఉంది. రూ.50 లక్షల వరకూ గృహరుణం తీసుకోవాలని అనుకుంటున్నాం. అప్పటి వరకూ నెలకు రూ.80 వేలు మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

శ్రీధర్‌

రెండేళ్ల వ్యవధే ఉంది కాబట్టి, నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేయొద్దు. పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. గృహరుణం తీసుకునేటప్పుడు కచ్చితంగా లోన్‌ కవర్‌ ఇన్సూరెన్స్‌ మర్చిపోవద్దు.


ఇటీవలే ఉద్యోగంలో చేరాను. బృంద ఆరోగ్య బీమా పాలసీలో భాగంగా రూ.5 లక్షల వరకూ రక్షణ ఉంది. ఇప్పుడు నేను సొంతంగా మరో పాలసీ తీసుకోవాలా? టాపప్‌ సరిపోతుందా?

ప్రకాశ్‌

బృంద ఆరోగ్య బీమా ఒక అదనపు రక్షణ మాత్రమే. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇది ఉపయోగపడుతుంది. ప్రాథమిక పాలసీగా దీన్ని చూడకూడదు. కాబట్టి, సొంతంగా ఒక పాలసీ తీసుకోవాలి. దానిపైనే టాపప్‌ పాలసీని తీసుకునే ప్రయత్నం చేయండి.


నేను చిరు వ్యాపారిని. ప్రజా భవిష్య నిధి, పోస్టాఫీసు నెలసరి పొదుపు పథకాల్లాంటి సురక్షిత పథకాలను ఎంచుకోవచ్చా? నెలకు రూ.5వేల వరకూ మదుపు చేయాలనుకుంటున్నాను. కనీసం 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు ఏం చేయాలి?

రవీంద్ర

సురక్షిత పథకాలతోపాటు కాస్త నష్టభయం ఉన్న వాటినీ పరిశీలించాలి. రూ.5వేలలో రూ.3వేలను ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో జమ చేయండి. మిగతా రూ.2వేలను డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో జమ చేయండి. ఇలా 15 ఏళ్లపాటు మదుపు చేస్తే 10 శాతం సగటు రాబడితో రూ.19,06,348 అయ్యేందుకు అవకాశం ఉంది.


తుమ్మ బాల్‌రాజ్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని