14 శాతం రాబడి సాధ్యమేనా?

రాబడి ఎక్కువగా రావాలంటే.. అధిక నష్టభయానికీ సిద్ధంగా ఉండాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మంచి రాబడి వస్తుంది. అదే సమయంలో కొంత నష్టభయమూ ఉంటుంది.

Updated : 21 Jul 2023 00:36 IST

* నా దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. వీటితో నాకు నాలుగేళ్ల తర్వాత అవసరం. కనీసం 14 శాతం రాబడి వచ్చేలా ఈ మొత్తాన్ని మదుపు చేయాలన్నది ఆలోచన. ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి?      
శ్రీధర్‌
రాబడి ఎక్కువగా రావాలంటే.. అధిక నష్టభయానికీ సిద్ధంగా ఉండాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మంచి రాబడి వస్తుంది. అదే సమయంలో కొంత నష్టభయమూ ఉంటుంది. మీరు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. 10-11 శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది. నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. నష్టం భరించగలను అనుకుంటే మిడ్‌ అండ్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. రాబడి మధ్యస్థంగా ఉన్నా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఫండ్లనే చూడండి.


* నేను చిరు వ్యాపారిని. నెలకు రూ.12 వేల వరకూ పెట్టుబడి పెట్టాలని ఆలోచన. పదేళ్ల వరకూ మదుపు చేస్తే ఎంత మొత్తం వస్తుంది? రూ.75 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే ఏం చేయాలి?
సురేశ్‌
మీ పదేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మీరు పదేళ్లపాటు నెలకు రూ.12వేల చొప్పున మదుపు చేస్తే 13 శాతం రాబడి అంచనాతో రూ.26,52,443 అయ్యేందుకు అవకాశం ఉంది. రూ.75 లక్షల బీమా పాలసీ కావాలంటే.. బీమా సంస్థలు మీ ఆదాయపు పన్ను రిటర్నులను అడిగే అవకాశం ఉంది. వాటి ఆధారంగానే ఎంత మొత్తం పాలసీ ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి.


* గత నెలలో పదవీ విరమణ చేశాను. ఇప్పుడు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వీలుంటుందా? సురక్షిత పథకాల్లో మదుపు చేసి, నెలకు రూ.10వేలు రావాలంటే ఏం చేయాలి?    

దేవేందర్‌
పదవీ విరమణ చేసినప్పటికీ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రంలో మీ ఆరోగ్య వివరాలన్నీ పూర్తిగా తెలియజేయండి. ముందస్తు వ్యాధులు ఉంటే.. మూడు నుంచి నాలుగేళ్ల పాటు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. కొన్నిసార్లు వైద్య పరీక్షలనూ అడిగే అవకాశం ఉంది. వాటి ఆధారంగా మీకు పాలసీ లభిస్తుంది. మీరు 60 ఏళ్లు దాటితే సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో మదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 8.2 శాతం రాబడి లభిస్తోంది. ఇందులో రూ.15 లక్షలు మదుపు చేస్తే రూ.10వేల వరకూ వడ్డీ అందుతుంది.


* సొంతిల్లు కొనాలనేది ఆలోచన. దీనికోసం నెలకు రూ.40 వేల వరకూ జమ చేస్తున్నాను. మరో రెండేళ్ల వరకూ ఈ డబ్బును ఎక్కడ మదుపు చేయాలి? షేర్లలో మదుపు చేస్తే మంచిదేనా?      

ప్రదీప్‌
రెండేళ్ల వ్యవధే ఉంది కాబట్టి, మీ డబ్బులు సురక్షిత పథకాల్లోనే ఉండేలా చూసుకోవాలి. తక్కువ వ్యవధి ఉన్నప్పుడు అధిక నష్టభయం ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టకూడదు. మీరు జమ చేయాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయడమే మంచిది.                           

 తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని