small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ పెంపు.. కొన్నింటిపైనే!

small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో  (small savings schemes)  కొన్నింటిపై వడ్డీ రేట్లను పెంచుతూ.....

Updated : 29 Sep 2022 20:49 IST

దిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో  (small savings schemes)  కొన్నింటిపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 30 బేసిస్‌ పాయింట్ల వరకు ఆయా పథకాలపై వడ్డీరేట్లను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్‌- డిసెంబర్‌) ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. మూడేళ్ల కాలావధి కలిగిన పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకంపై వడ్డీ 5.8 శాతానికి చేరనుంది. ప్రస్తుతం 5.5 శాతంగా ఉంది. ఈ పథకంపై 30 బేసిస్‌ పాయింట్లు వడ్డీ పెంచారు. అలాగే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై వడ్డీ రేటును 20 బేసిస్‌ పాయింట్లు మేర పెంచారు. దీంతో ఈ పథకంలో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ లభిస్తుండగా.. మూడో త్రైమాసికానికి 7.6 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నారు. కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ పథకాలపై ఇప్పుడున్న వడ్డీనే కొనసాగనుంది. 

ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ ఇటీవల వరుసగా వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. మే నెల నుంచి ఇప్పటి వరకు 140 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటు పెంచింది. దీంతో ఆయా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ క్రమంలో చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని