Budget 2024: మూలధన వ్యయం ₹11.11 లక్షల కోట్లు

Union budget 2024: మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. తాత్కాలిక బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది.

Published : 01 Feb 2024 16:45 IST

Union budget | దిల్లీ: ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మరోసారి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (Union budget 2024) తాత్కాలిక బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని మరింత పెంచింది. గతేడాదితో పోలిస్తే 11.11 శాతం మేర కేటాయింపులు పెంచి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్‌లో రూ.7.36 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 2023-24లో ఏకంగా 30 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చిన సంగతి తెలిసిందే.

రైల్వేలో మూడు కారిడార్లు

రైల్వేను మూడు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఎనర్జీ, మినరల్‌, సిమెంట్‌ కారిడార్‌; పోర్ట్‌ కనెక్టివిటీ కారిడార్స్; హై ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల సరకు రవాణా సామర్థ్యం మెరుగవడంతో పాటు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ స్థాయికి తీసుకురావడం ద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుకానున్నాయని చెప్పారు.

వేగంగా.. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి

దేశంలో ఎయిర్‌పోర్టుల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు రెట్టింపు చేసి 149కి పెంచినట్లు తెలిపారు. దేశీయ విమానయాన సంస్థలు వెయ్యి కొత్త విమానాలకు ఆర్డర్‌ పెట్టినట్లు వివరించారు. ప్రపంచంలోనే పౌరవిమానయాన రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఉడాన్‌ స్కీమ్ ద్వారా 517 కొత్త రూట్లు అందుబాటులోకి వచ్చాయని, 1.3 కోట్ల మంది ప్రయాణికులు ఆయా మార్గాల్లో ప్రయాణం సాగించారని చెప్పారు.

జాతీయ రహదారులకు 2.78 లక్షల కోట్లు

జాతీయ రహదారుల కోసం బడ్జెట్‌లో ఈసారి రూ.2.78 లక్షల కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.2.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్‌హెచ్‌ఏఐకి బడ్జెట్‌లో రూ.1.67 లక్షల నుంచి రూ.1.68 లక్షల కోట్లకు కేటాయింపులు పెంచారు. దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వే రహదారుల నిర్మాణ బాధ్యతను NHAI, నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHIDCL)లు చూస్తుంటాయి.

ఇ-బస్సులకు పెద్ద పీట

దేశంలో విద్యుత్‌ వాహనాలకు ఊతం ఇచ్చేందుకు ఛార్జింగ్‌ మౌలిక వసతుల కల్పన, తయారీని ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఛార్జింగ్‌, తయారీ మౌలిక వసతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ముఖ్యంగా ప్రజారవాణాకు వినియోగించే ఇ-బస్సులకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని