Tesla: కేంద్రమంత్రికి మస్క్‌ క్షమాపణలు.. ఎందుకంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత ప్రవేశంపై వార్తలు వస్తోన్న తరుణంలో.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) కాలిఫోర్నియాలోని సంస్థ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. 

Updated : 14 Nov 2023 12:37 IST

కాలిఫోర్నియా: విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) సందర్శించారు. మంగళవారం కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న ఈ  కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని పరిశీలించారు. ఈ సందర్శన గురించి ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే ఆ సమయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌.. మంత్రి వెంట కనిపించలేదు. దీనిపై గోయల్‌కు మస్క్‌ క్షమాపణలు తెలియజేశారు.

‘ఫ్రెమోంట్‌లోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఈ కేంద్రంలో సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజనీర్లు, ఆర్థిక నిపుణులను చూడటం చాలా ఆనందాన్ని కలిగించింది. టెస్లా అద్భుత ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం అమోఘం. టెస్లా సప్లయ్‌ చైన్‌లో భారత్‌ నుంచి విడి పరికరాల సరఫరాకు ప్రాముఖ్యత పెరుగుతుండటం గర్వంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్‌ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని తన పర్యటన చిత్రాలను పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) పోస్టు చేశారు.

త్వరలో ఎలాన్‌ మస్క్‌ బయోపిక్‌

మంత్రి ట్వీట్‌పై మస్క్‌ నుంచి స్పందన వచ్చింది. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. త్వరలో మీతో భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని ఈ టెక్‌ దిగ్గజం సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన టెస్లా (Tesla) విద్యుత్‌ కార్లు త్వరలోనే భారత రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న తరుణంలో జరిగిన ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)తో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సమావేశమయ్యారు. భారత్‌లో గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. తాజా పర్యటనలో గోయల్‌-మస్క్‌ భేటీ జరుగుతుందని, వారు భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. మస్క్‌ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యపడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు