Elon Musk: త్వరలో ఎలాన్‌ మస్క్‌ బయోపిక్‌

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ జీవితం సినిమా రూపంలో రానుంది. ఆయన ఆత్మకథ ఆధారంగా బయోపిక్‌ను నిర్మించనున్నారు.

Published : 14 Nov 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తుల జీవిత విశేషాలతో బయోపిక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతల జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. తాజాగా టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్ జీవితం త్వరలో సినిమాగా రాబోతుంది. రెండు నెలల క్రితం ఆయన జీవిత కథ పుస్తకం రూపంలో ‘ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)’ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. వాల్టర్‌ ఐజాక్సన్ (Walter Isaacson) అనే అమెరికన్ రచయిత దీన్ని రచించాడు. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్‌ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో గొప్ప విజయాలు ఎలా సాధించారు? వంటి అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించారు.

ప్రస్తుతం ఈ పుస్తకం ఆధారంగానే మస్క్ బయోపిక్‌ తీస్తున్నారు. ఈ మేరకు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ మస్క్‌ బయోపిక్‌ తీసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం పుస్తక రచయిత నుంచి నిర్మాణ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ డారెన్‌ ఆర్‌న్ఫోస్కీ (Darren Aronofsky) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన బ్లాక్‌ స్వాన్‌, పై, ది వేల్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌లో మస్క్ వృత్తి జీవితంతోపాటు, వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా చూపించనున్నారు. అయితే, మస్క్‌ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలను వెల్లడించలేదు. 

విడిపోతున్న బిలియనీర్‌ గౌతమ్‌ సింఘానియా దంపతులు

ఎలాన్‌ మస్క్‌.. అంతరిక్ష ప్రయోగాల కోసం 2002లో స్పేస్‌ఎక్స్‌ను, 2003లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాను స్థాపించాడు. ఆ తర్వాత ది బోరింగ్‌, న్యూరాలింక్‌, సోలార్‌ సిటి వంటి సంస్థలను నెలకొల్పారు. ఈ క్రమంలోనే గతేడాది సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ను సైతం కొనుగోలు చేసి, దాని పేరును ఎక్స్‌గా మార్చారు. త్వరలో దాన్ని సూపర్‌ యాప్‌గా మార్చనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని