సీనియర్‌ సిటిజన్ల స్పెషల్‌ ఎఫ్‌డీ గడువు పొడిగించిన HDFC బ్యాంక్‌

 ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) సీనియర్‌ సిటిజన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ గడువు పొడిగించింది.

Updated : 06 Oct 2022 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) సీనియర్‌ సిటిజన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ గడువు పొడిగించింది. కొవిడ్‌ -19 కారణంగా వడ్డీ రేట్లు తగ్గినందున.. వాటి ప్రభావం సీనియర్‌ సిటిజన్లపై పడకూడదనే ఉద్దేశంతో పలు బ్యాంకులు సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీని 2020లో ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ కూడా 2020 మే 15న ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీని తీసుకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ఈ పథకం గడువు ముగియగా... మరోసారి గడువు పొడిగించింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో ఈ పథకం గడువు 2023 మార్చి 31 వరకు పెంచింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేటు కంటే సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు అదనపు వడ్డీ అందిస్తోంది. ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్లు మరో 25 బేసిస్‌ పాయింట్లు అదనపు వడ్డీ పొందుతారు. అంటే.. సాధారణ ప్రజల కంటే సీనియర్‌ సిటిజన్లకు మొత్తం మీద 75 బేసిస్‌ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల లోపు కాలపరిమితి గల రూ.5 కోట్లలోపు డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది. సీనియర్‌ సిటిజన్లు కొత్తగా చేసే డిపాజిట్లపై, పునరుద్ధరణ సమయంలో మాత్ర‌మే ఇది వర్తిస్తుంది. ప్రవాస భారతీయులకు ఈ ఆఫర్‌ వర్తించదు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రస్తుతం 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.75% వడ్డీ రేటును అందిస్తుండగా.. ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ కింద సీనియర్‌ సిటిజన్లకు 6.50% వడ్డీ అందిస్తోంది. ఈ అదనపు వడ్డీ ప్రయోజనం పొందేందుకు సీనియర్‌ సిటిజన్లు 2023  మార్చి 31లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముందస్తు విత్‌డ్రాలు..

పైన తెలిపిన ఆఫర్‌ కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (స్వీప్‌-ఇన్‌/ పాక్షిక క్లోజర్‌)లు బుక్‌ చేసుకున్నవారు 5 సంవత్సరాల కంటే ముందే విత్‌డ్రా చేసుకుంటే.. కాంట్రాక్ట్‌ రేటు కంటే 1% తక్కువ లేదా బ్యాంకు వారు నిర్దిష్ట పిరియడ్‌కి ఆఫర్‌ చేస్తున్న బేస్‌ రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ వడ్డీ రేటును అందిస్తారు. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత, మెచ్యూరిటీ పీరియడ్‌ కంటే ముందే విత్‌డ్రా చేసుకుంటే.. కాంట్రాక్ట్‌ రేటు కంటే 1.25% తక్కువ లేదా బ్యాంకు వారు నిర్దిష్ట పిరియడ్‌కు ఆఫర్‌ చేస్తున్న బేస్‌ రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ వడ్డీ రేటును అందిస్తారు.

ఇతర బ్యాంకులు..

ఆర్‌బీఐ ఇటీవల 50 బేసిస్‌ పాయింట్లను పెంచడంతో రెపోరేటు 5.90%కు చేరింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంకులు కూడా సీనియర్‌ సిటిజన్లకు అందించే స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువు తేదీని పొడిగించాయి. ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం ‘గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ’ స్కీమ్‌ను పొడిగించలేదు. ఈ పథకం అక్టోబరు 7తో ముగియనుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts