Financial Goal: ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఎక్కడ మదుపు చేయాలి?

ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. లక్ష్యాలన్నింటికి ఒకే పొదుపు సాధనంలో మదుపు చేయలేం. వివిధ లక్ష్యాలకు ఎలాంటి మదుపు సాధనాలను ఉపయోగించుకోవాలో ఇక్కడ చూడండి..

Published : 07 Dec 2023 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతి ఒక్కరికీ జీవితంలో అనేక ఆర్థిక లక్ష్యాలుంటాయి. కారు కొనుగోలు, విహారయాత్రలకు వెళ్లడం, పిల్లలను ఉన్నత చదువులు చదివించడం, వివాహం లాంటి లక్ష్యాలు ఉంటాయి. అంతేకాకుండా జీవితంలో ముఖ్యమైన పెద్ద లక్ష్యాలైన ఇల్లు కొనుగోలు, రిటైర్‌మెంట్‌కు భారీ నిధి గురించి ప్లాన్‌ చేస్తుంటారు. ఈ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో కొంత ప్రయత్నిస్తుంటూ ఉంటారు. అయితే, అన్ని లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఒకే లాంటి ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు సరిపోవు. వేర్వేరు పథకాలు అవసరం పడతాయి. ఏ ఆర్థిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలాంటి మదుపు పథకం సరిపోతుందో ఇక్కడ చూడండి..

కారు కొనుగోలు

కారు కొనుగోలు అనేది ఒకప్పటి రోజుల్లో పెద్ద లక్ష్యం అయినప్పటికీ.. ప్రస్తుతం మధ్యతరగతి ఆదాయాలు గణనీయంగా పెరగడం వల్ల ఈ రోజుల్లో ఇది పెద్ద లక్ష్యం కాదు. దీనికి స్వల్ప కాల వ్యవధి 3 ఏళ్ల పాటు బ్యాంకు ఆర్‌డీలో పొదుపు చేసి సొంతంగానే కారు కొనుగోలు చేయొచ్చు. ప్రతి నెలా రూ.15 వేలు 7% వడ్డీ అంచనాతో బ్యాంకు ఆర్‌డీలో పొదుపు చేస్తే, 3 ఏళ్లకు రూ.6 లక్షలు సమకూరుతుంది. ఈ బడ్జెట్‌లో కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రూ.10-12 లక్షల కారు కొనుగోలు చేయాలనుకుంటే 50% డౌన్‌ పేమెంట్‌ కట్టి, మిగిలిన మొత్తానికి గాను బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు. ఎక్కువ డౌన్‌ పేమెంట్‌ కట్టడం వల్ల ఈఎంఐ తగ్గుతుంది.

విహార యాత్ర

చాలా మంది తమ దైనందిన వృత్తి జీవితంలో తీరిక లేకుండా ఉంటారు. పిల్లలు కూడా చదువుల మీద దృష్టి పెట్టడం వల్ల ఖాళీగా ఉండరు. ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ సెలవులు లభించినప్పుడు మానసిక ప్రశాంతత కోసం చాలా మంది టూర్లకు ప్లాన్‌ చేస్తుంటారు. విహార యాత్ర ఖర్చుల కోసం స్వల్పకాల వ్యవధిలో డబ్బును సమకూర్చుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ లాంటి ట్రావెల్ ప్లానర్లు కూడా టూరిస్ట్‌లకు ఇబ్బంది లేకుండా దాదాపుగా అన్ని సమయల్లోనూ తగిన ప్లాన్లను సిద్ధం చేస్తుంటాయి. ప్రతి నెలా రూ.7 వేలను, 7% వడ్డీ అంచనాతో బ్యాంకు ఆర్‌డీలో 2 ఏళ్ల పాటు మదుపు చేస్తే, రూ.2.06 లక్షలు చేతికి వస్తుంది. ఈ మొత్తంతో నలుగురితో కూడిన కుటుంబం 10-12 రోజుల పాటు ఇతర రాష్ట్రాలకు టూర్‌ ప్లాన్‌ చేయొచ్చు. దేశంలో వివిధ ప్రాంతాల సంప్రదాయ, సంస్కృతులను తెలుసుకుంటూ సెలవులను ఆస్వాదించొచ్చు.

చదువు

ప్రస్తుతం తల్లిదండ్రులు తమ భవిష్యత్‌ గురించి కన్నా, పిల్లల భవిష్యత్‌ (చదువు) గురించి ఎక్కువ తపన పడుతున్నారు. పిల్లల ఉన్నత విద్య కూడా డబ్బుతో ముడిపడి ఉన్నదే. ఏటా విద్యా ద్రవ్యోల్బణం 10-12% పెరుగుతోంది. ఉన్నత విద్య దీర్ఘకాల ప్రణాళిక అయినప్పటికీ, ఈ ఆర్థిక ప్రణాళిక అమలు చేసేటప్పుడు రిస్కతో కూడిన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టలేం. దీనికి పీపీఎఫ్‌ సరైన పథకంగా చెప్పవచ్చు. బ్యాంకు/పోస్టాఫీసులో పీపీఎఫ్‌ ఖాతాను ప్రారంభించొచ్చు. పిల్లల 3వ ఏట నుంచే ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలను 15 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే, (ప్రస్తుతమున్న) 7.10% వడ్డీ అంచనాతో మొత్తం రూ.40.70 లక్షల నిధి సమకూరుతుంది. మొత్తం రాబడి పూర్తిగా పన్ను రహితం. ఈ నిధి అప్పటి ఉన్నత విద్యా ఖర్చులకు సుమారుగా సరిపోవచ్చు.

వివాహం

భారతీయ కుటుంబ వ్యవస్థలో వివాహం కీలకమైంది. వివాహంలో అనేక సంప్రదాయాలు ముడిపడి ఉన్న కారణంగా ఖర్చులు కూడా ఎక్కువే. ఆర్థిక ప్రణాళికలో వివాహ లక్ష్యానికి దీర్ఘకాలం పాటు కృషిచేయవలసి ఉంది. పిల్లలు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వివాహం ఏ సమయంలోనైనా జరగవచ్చు. బాలికల వివాహం ఖర్చుల కోసం సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకం సరైంది. బ్యాంకు/పోస్టాఫీసులో ఎస్‌ఎస్‌వై ఖాతాను ప్రారంభించొచ్చు. ఇది 21 ఏళ్ల దీర్ఘకాల పథకం అయినప్పటికీ, డిపాజిట్‌ను 15 ఏళ్ల పాటు చేయాలి. (మేజర్‌) కుమార్తెకు వివాహం చేసేటప్పుడు ఈ పథకం నుంచి డబ్బును ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు బాలిక 3వ ఏట నుంచి ప్రతి ఏడాది రూ.1.50 లక్షలు డిపాజిట్‌ చేస్తే (ప్రస్తుతం ఉన్న) 8% వడ్డీ అంచనాతో.. ఆమె 24వ ఏట దాదాపు రూ.67.30 లక్షలు అందుకుంటారు. మొత్తం రాబడి పూర్తిగా పన్ను రహితం.

ఇల్లు

ఇల్లు కొనుగోలు అనేది జీవితంలో ఎవరికైనా ముఖ్యమైనదే. కానీ, ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది. కొనుగోలుదారుడు భారీ మొత్తంలో డౌన్‌ పేమెంట్‌ను కట్టడమే కాకుండా, రుణం కూడా అధిక మొత్తంలోనే తీసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం రూ.80 లక్షలుండే ఇల్లు.. సగటు ద్రవ్యోల్బణం 7% ప్రకారం.. 10 ఏళ్ల తర్వాత రూ.1.60 కోట్లు అవుతుంది. 60 లక్షలు డౌన్ పేమెంట్‌ను చెల్లించి, రూ.1 కోటిని రుణం తీసుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు 10 ఏళ్ల పాటు కొంత మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ‘సిప్‌’ ద్వారా మదుపు చేసి, దాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లించొచ్చు. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకుని 20 ఏళ్ల పాటు ఈఎంఐలు చెల్లించవచ్చు. డౌన్‌పేమెంట్‌కు నిధి సమకూర్చుకోవడం, రుణం తీసుకున్న తర్వాత ఎంతెంత ఈఎంఐలు చెల్లించాలో కింది పట్టికలలో ఉన్నాయి.

పదవీ విరమణ నిధి

అన్ని లక్ష్యాల కంటే పదవీ విరమణ లక్ష్యం చాలా కీలకమైంది. ఈ వయసులో ఆదాయం సరిగ్గా ఉండదు. కాబట్టి రుణం కూడా లభించదు. కష్టపడి పనిచేసి ఆదాయం సంపాదించేటప్పుడే తగిన రిటైర్‌మెంట్‌ నిధి కోసం ప్రణాళికగా వ్యవహరించాలి. ఈ ఆర్థిక లక్ష్యం చేరుకోవడానికి కనీసం 30వ ఏట నుంచే మదుపు చేయడం ప్రారంభించాలి. పదవీ విరమణ దీర్ఘకాల లక్ష్యం. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు దీనికి సరిగ్గా సరిపోతాయి. దీర్ఘకాలంలో ఈ ఫండ్ల నుంచి కనీసం 12% రాబడిని ఆశించవచ్చు. 30 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.10 వేలను సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తే.. 60 ఏళ్ల వయసు నాటికి దాదాపు రూ.3.50 కోట్లు అందుకోవచ్చు. అయితే, పదవీ విరమణకు 3 ఏళ్ల ముందే ఈ నిధి మొత్తాన్ని ఉపసంహరించుకుని బ్యాంకు ఎఫ్‌డీలలో మదుపు చేస్తే ఊహించని రిస్క్‌ల నుంచి కాపాడుకోవచ్చు.

పెన్షన్

పదవీ విరమణ నిధిని సమకూర్చుకున్న తర్వాత ఆ మొత్తాన్ని వివిధ ఎఫ్‌డీలు, రిటైర్‌మెంట్‌ పథకాల్లో భద్రపరిచి వడ్డీ తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, వయ వందన యోజన లాంటి అనేక పథకాల్లో పెట్టుబడి పెట్టి నెల నెలా పెన్షన్ పొందొచ్చు. పదవీ విరమణ చేసిన వారు ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెట్టకపోవడమే మేలు. సీనియర్‌ సిటిజన్స్‌కు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 7-8% వడ్డీని అందిస్తున్నాయి. 

ఎన్‌పీఎస్‌

పదవీ విరమణ లక్ష్యానికి నిధులు సమకూర్చుకోవడానికి ‘ఎన్‌పీఎస్‌’ కూడా మంచి పథకమే. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధుల‌ను కూడ‌బెట్టుకుని, స్థిర‌మైన పెన్ష‌న్ పొందాల‌నుకునే వారికి ఎన్‌పీఎస్‌ అనేది ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిన పెట్టుబ‌డి. పీఎఫ్ఆర్‌డీఏ నియంత్రణలో ఉండే నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌), పౌరుల ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఆదా చేసే ల‌క్ష్యంతో ఒక ప్ర‌ముఖ పెట్టుబ‌డి ప‌థ‌కంగా ఏర్ప‌డింది. 18-70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వయసు ఉన్న ఎవ‌రైనా ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. ఎవ‌రైనా 30 సంవ‌త్స‌రాల వయసు లోపు ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరిస్తే మంచి ఆర్థిక ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. వారు 60 సంవ‌త్స‌రాల వయసులో ఉన్న‌ప్పుడు ఎన్‌పీఎస్‌ మెచ్యూర్ అవుతుంది. ఎన్‌పీఎస్ నుంచి ముంద‌స్తు నిష్క్రమణ అనుమ‌తి ఉంది. కానీ, మెచ్యూరిటీకి ముందు ఉప‌సంహ‌రించుకుంటే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మీరు మెచ్యూరిటీ స‌మ‌యంలో గ‌రిష్ఠంగా 60% కార్ప‌స్‌ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగిలిన 40% మొత్తాన్ని పథకంలో నిర్దేశించిన పెన్షన్ పథకాల్లో ఒకటి ఎంచుకుని, తద్వారా సాధార‌ణ పెన్ష‌న్‌ను పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని