Financial Planning: మొదటి జీతం అందుకున్నారా? ఇలా చేయండి..

ఉద్యోగంలో చేరినప్పుడే పొదుపు, పెట్టుబడులను ప్రారంభిస్తే..వివాహం, సొంతిల్లు ఏర్పాటు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు మీరే డబ్బు సమకూర్చుకోవచ్చు.

Published : 14 Feb 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువత సాధారణంగా 20-30 ఏళ్ల మధ్యలో మొదటి జీతం అందుకుంటుంటారు. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆర్థిక ప్రణాళిక, పొదుపు, పెట్టుబడుల గురించి పెద్దగా ఆలోచించరు. కొందరు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బైక్‌/కారు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తే.. మరికొందరు స్నేహితులతో కలిసి విందు, వినోదాల కోసం ఖర్చు చేస్తుంటారు. సంతోషం కోసం ఖర్చు చేయడంలో తప్పు లేదు.. కానీ, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయినీ ఖర్చు చేసే ముందు ఆలోచించాలి.

సంపాదన ప్రారంభమైనప్పుడు బాధ్యతలు తక్కువే ఉంటాయి. కానీ, రాబోయే రోజుల్లో అనేక ముఖ్యమైన మైలురాళ్లు దాటాల్సి ఉంటుంది. వీటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. కాబట్టి సంపాదన ప్రారంభమవ్వగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. క్రమశిక్షణతో పొదుపు చేయడం, పెట్టుబడులు అలవరచుకోవాలి. 

బడ్జెట్‌ వేసుకోండి..

ముందుగా నెలవారీ బడ్జెట్‌ను తయారు చేయండి. ఇందులో మీ సంపాదన, ఖర్చులు.. అన్నీ దశల వారీగా రాసుకోండి. దీని ద్వారా మీరు ప్రాథమిక అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారా? లగ్జరీ కోసం ఖర్చు చేస్తున్నారా? తెలుస్తుంది. సంపాదించిన దాంట్లో నెలవారీగా ఎంత పొదుపు చేస్తున్నారో కూడా తెలుస్తుంది.

బడ్జెట్‌ను అనుసరించండి..

మీ ప్రతి నెలా సంపాదన నుంచి కనీసం 25% అయినా పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. దానికి తగినట్లుగా బడ్జెట్‌ వేసి.. దానికే కట్టుబడి ఉండండి. అప్పుడు మీరు అనుకున్న ప్రకారం పొదుపు చేయగలుగుతారు.

ఆదాయం - పొదుపు = ఖర్చులు..

ఈ సూత్రానికి కట్టుబడితే.. ఖర్చులను అదుపు చేసుకోవడం సులభం అవుతంది. తక్కువ సంపాదన ఉన్నా, దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని కూడబెట్టగలుగుతారు. ఉదాహరణకు మీరు నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. అందులో మీరు ప్రతినెలా రూ.10 వేలు పొదుపు చేయాలనుకున్నారు అనుకోండి. ఈ మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన రూ.20 వేలల్లోనే అన్ని ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. ఈ రూ.10 వేలు పెట్టుబడులకు కేటాయించాలి. ప్రతి నెలా రూ.10 వేలు మదుపు చేస్తే 12% రాబడి అంచనాతో 20 ఏళ్లలో సుమారుగా రూ.1 కోటి కూడబెట్టగలుగుతారు.

పొదుపు శాతం తగ్గనీయకండి..

ప్రస్తుతం మీ జీతం రూ.30 వేలలో మీరు రూ.10 వేలు పొదుపు చేస్తున్నారు అనుకుందాం. రెండు, మూడేళ్లకు మీ జీతం రూ.50 వేలకు చేరిన తర్వాత కూడా అదే రూ.10 వేలు పొదుపు చేయడం సరికాదు. రూ.30 వేలలో దాదాపు 30% పొదుపు చేస్తున్నారు కాబట్టి, రూ.50 వేలలో కూడా 30%, అంటే రూ.15 వేలకు తగ్గకుండా పొదుపు చేయాలి. 

సమయానికి చెల్లించండి..

మీ ఖర్చులకు సంబంధించి అన్ని బిల్లులు సమయానికి చెల్లించండి. అప్పుడే ఆలస్యపు రుసుముల నుంచి దూరంగా ఉండగలుగుతారు. చెల్లింపుల విషయంలో ఆలసత్వం, వాయిదాలు వేయడం వంటివి వద్దు.

పెట్టుబడులు మొదలుపెట్టండి..

ప్రతి నెలా పొదుపు చేసిన మొత్తాన్ని, కాలక్రమంలో విలువను పెంచే పెట్టుబడుల్లో మదుపు చేయండి.

కాంపౌండింగ్‌తో సమర్థంగా..

క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే, తక్కువ మొత్తం మదుపు చేసినా కాంపౌండింగ్‌ ప్రభావంతో ఎక్కువ మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. కాబట్టి, త్వరగా పెట్టుబడులను ప్రారంభించండి. 

మీ రక్షణ కోసం..

జీవిత, ఆరోగ్య బీమాలను తీసుకోవడం ద్వారా ఊహించని ప్రమాదాల బారిన పడినా, ఆర్థికంగా మీకు మీరే రక్షణ కల్పించుకోవచ్చు. మీతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించవచ్చు. 

అత్యవసర నిధి ఏర్పాటు..

పెట్టుబడులు చేస్తూనే, ఊహించని ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఉద్యోగంలో వృద్ధి కోసం యువత తరచూ సంస్థలు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో రెండు, మూడు నెలలు ఉద్యోగం లేకపోయినా.. మీ ఖర్చులు, పెట్టుబడులకు ఆటంకం కలుగకుండా ఈ నిధి మీకు సహాయపడుతుంది. 

మంచి క్రెడిట్‌ స్కోరు..

సంపాదన మొదలవ్వగానే సంస్థలు క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిని సమర్థంగా వినియోగించుకుంటూ మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకునే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్‌ లోన్‌ ఉన్నవారు సమయానికి చెల్లింపులు చేయడం ద్వారా మంచి క్రెడిట్‌ స్కోరు సాధించవచ్చు. మంచి క్రెడిట్‌ స్కోరు ఉంటే భవిష్యత్‌లో తక్కువ వడ్డీకే, త్వరితగతిన రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈక్విటీలను ఎంచుకోవచ్చు..

పెట్టుబడుల విషయంలో యువతకు వయసు కలిసొచ్చే అంశం. తక్కువ వయసు కారణంగా అధిక రిస్క్‌ తీసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈక్విటీలకు కేటాయించవచ్చు. ముందుగా ఇండెక్స్‌ ఫండ్స్‌తో ప్రారంభించండి. కాలక్రమేణా మిడ్‌క్యాప్‌ ఫండ్లను ఫోర్ట్‌ఫోలియోకు జోడించవచ్చు. సిప్‌ ద్వారా పెట్టుబడులు పెడుతుంటే పొదుపు, పెట్టుబడులు అలవాటుగా మారతాయి. జీవితంలో కీలక దశలకు చేరుకన్నప్పుడు ఈ మొత్తం మీకు సహాయపడుతుంది. మీ లక్ష్యం 3 ఏళ్ల దూరంలో ఉన్నప్పుడు డెట్‌ ఫండ్‌లకు మారేందుకు ప్రయత్నించవచ్చు. అత్యవసర నిధి కోసం మాత్రమే బ్యాంక్‌ ఖాతాలో నిధులను ఉంచొచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం కాదు.

చివరిగా..

మొదటి జీతం అందుకున్న నాటి నుంచే క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు చేస్తే.. మీ సంపాదనతోనే వివాహం, సొంత ఇల్లు వంటి వాటికి నిధులను సమకూర్చుకోవచ్చు. తల్లిదండ్రులపై ఆధారపడనవసరం ఉండదు. అలాగే, మలి వయసులో పిల్లల మీద ఆధారపడకుండా నిధిని సమకూర్చుకోవచ్చు. అందువల్ల, పెట్టుబడులను వాయిదా వేయకుండా నేడే ప్రారంభించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని