Per capita income: రూ.1,72,000కు దేశ తలసరి ఆదాయం

per capita income: ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం (per capita income)లో వచ్చిన వృద్ధి చాలా తక్కువని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ అన్నారు.

Published : 05 Mar 2023 18:01 IST

దిల్లీ: భారతదేశ తలసరి ఆదాయం (per capita income) ప్రస్తుత ధరల వద్ద రూ.1,72,000కు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం (NSO) వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2014-15లో ఎన్‌ఎస్‌ఓ ప్రకారం అది రూ.86,647గా ఉంది. ఈ లెక్కన దాదాపు 99 శాతం వృద్ధి నమోదైంది. అదే స్థిర ధరల వద్ద 2014-15లో దేశ తలసరి ఆదాయం (per capita income) రూ.72,805గా ఉండగా.. ప్రస్తుతం అది రూ.98,118కి చేరింది. దీంట్లో 35 శాతం వృద్ధి నమోదైంది.

ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం (per capita income)లో వచ్చిన వృద్ధి చాలా తక్కువని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ అన్నారు. పైగా సంపదలో అగ్రభాగాన ఉన్న 10 శాతం జనాభా వల్లే తలసరి ఆదాయం (per capita income) భారీగా పెరిగినట్లు తెలిపారు. సగటు వేతనాలు మాత్రం పడిపోయాయని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం.. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రస్తుత ధరలు, స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2021-22 నుంచి తిరిగి పుంజుకుంటోంది.

వరల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఇండికేటర్‌ డేటాబేస్‌ ప్రకారం.. భారత తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద 2014-2019 మధ్య ఏటా 5.6 శాతం వృద్ధి చెందినట్లు ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ ఎన్‌ఐపీఎఫ్‌పీ మాజీ డైరెక్టర్‌ పినాకీ చక్రవర్తి తెలిపారు. ఇది చాలా గణనీయ వృద్ధి అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో మెరుగైన వృద్ధి సాధించామన్నారు. కొవిడ్‌ తర్వాత వేగంగా పుంజుకున్నామని పేర్కొన్నారు.

స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం ఎగబాకడం దేశంలో పెరుగుతున్న సంపదకు నిదర్శనమని ఐఎస్‌ఐడీ డైరెక్టర్‌ నగేశ్‌ కుమార్‌ అన్నారు. అయితే, తలసరి ఆదాయం దేశ ప్రజల ఆదాయాల సగటు అని తెలిపారు. సగటు ఎప్పుడూ ఆర్థిక అసమానతలను ప్రతిబింబించదని పేర్కొన్నారు. సంపదలో అట్టడుగున ఉన్న వారి పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం భారత ఆర్థిక పరిస్థితి ప్రకాశవంతంగా కనిపిస్తోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని