IRCTC: కార్తిక మాసంలో ₹21 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC ప్యాకేజీ వివరాలివే..!

IRCTC tour package: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 7 జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో సందర్శించుకునే అవకాశాన్ని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కల్పించింది. వీటితో పాటూ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని కూడా వీక్షించవచ్చని తెలిపింది.

Updated : 13 Nov 2023 09:05 IST

మహా కాళేశ్వర ఆలయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకే యాత్రలో 7 జ్యోతిర్లింగాల దర్శన అవకాశాన్ని కల్పిస్తూ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. కార్తిక మాసం పురస్కరించుకుని ఈ జ్యోతిర్లింగాల యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ సంయుక్త జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ తెలిపారు. ఈ ఏడాది ఈ యాత్రను విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏడు జ్యోతిర్లింగ దర్శనయాత్రతో పాటు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని (Sapta Jyotirlinga Darshan Yatra with Statue of Unity) వీక్షించవచ్చన్నారు.

నవంబరు 18 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం పన్నెండు రాత్రులు పదమూడు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టూటైర్‌ ఏసీ క్లాసుల్లో టికెట్లు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన రెండు క్లాసుల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధరలు రూ.21 వేల నుంచి ప్రారంభమవుతాయి.

సోమనాథ ఆలయం

ప్రయాణం ఇలా..

  • నవంబర్‌ 18న విజయవాడలో రాత్రి ఎనిమిది గంటలకు రైలు బయల్దేరుతుంది. ఖమ్మం మీదుగా ప్రయాణం సాగుతుంది.
  • రెండో రోజు వేకువజామున 2: 42 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొని అక్కడ యాత్రికులను ఎక్కించుకొని ప్రయాణం కొనసాగుతుంది.
  • మూడో రోజు ఉదయం 5:35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అల్పాహారం తీసుకొని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం టిఫిన్‌ చేసుకొని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం ఉజ్జయిని రైల్వే స్టేషన్‌ చేరుకొని వడోదరకు పయనమవుతారు.
  • ఐదోరోజు ఉదయం 7:30 గంటలకు వడోదర చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షిస్తారు. అనంతరం ద్వారకకు బయల్దేరుతారు.
  • ఆరో రోజు ద్వారకలో ద్వారకాదీశ్‌ ఆలయాన్ని వీక్షిస్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • ఏడో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక బెట్‌ ద్వారకను వీక్షించి, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సాయంత్రానికి ద్వారకకు చేరుకుంటారు. తర్వాత సోమనాథ్‌కు బయల్దేరుతారు.
  • ఎనిమిదో రోజు సోమనాథ్‌లో కాస్త సేదతీరాక సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకొన్నాక సాయంత్రం సోమనాథ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం ప్రారంభమవుతుంది.
  • తొమ్మిదో రోజు రాత్రి నాసిక్‌లోనే బస ఉంటుంది.
  • పదో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణెకు పయనమవుతారు.
  • 11 రోజు ఉదయం టిఫిన్‌ చేశాక భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఔరంగాబాద్‌ బయల్దేరతారు.
  • 12 రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సికింద్రాబాద్‌కు పయనమవుతారు.
  • 13వ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌, మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ చేరుకుంటారు. దీంతో మీ సప్త జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది.

స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ

ఫుడ్‌ ఐఆర్‌సీటీసీదే..

  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు. రాత్రి బస కూడా రైల్వేదే బాధ్యత.
  • యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాలి.

టికెట్‌ ధర 

  • ఎకానమీలో అంటే స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణానికి ఒక్కో టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.21,000; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.19,500 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో అంటే థర్డ్‌ ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.32,500; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.31,000 చెల్లించాలి.
  • కంఫర్ట్‌లో 2ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.42,500; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.40,500 చెల్లించాలి.
  • క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ఈ టూర్‌కు సంబంధించిన టికెట్ల బుకింగ్‌, ఇతర వివరాల కోసం క్లిక్‌ చేయండి..

త్రయంబకేశ్వరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని