Maradona: ప్రపంచకప్‌ అర్జెంటీనాకు.. ‘మారడోనా’ బ్రాండ్‌ భారత్‌కు..!

‘మారడోనా’ బ్రాండ్‌ పేరిట ఫ్యాషన్‌, స్పోర్ట్స్‌, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అనేక వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Published : 19 Dec 2022 14:49 IST

కోల్‌కతా: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ (FIFA World Cup)ను అర్జెంటీనా గెలవడంతో భారత్‌లోని మెస్సి (Messi) అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే అదే దేశానికి చెందిన మరో దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు దివంగత డిగో మారడోనా (Maradona) పేరిట ఉన్న బ్రాండ్‌ భారత్‌లోకి రంగ ప్రవేశం చేస్తోంది. ఈ మేరకు భారత్‌లోని ఓ కంపెనీతో లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది.

‘మారడోనా (Maradona)’ బ్రాండ్‌ యజమాని అయిన ‘సట్వికా ఎస్‌ఏ’ తమని ప్రత్యేక భారత భాగస్వామిగా ఎంచుకున్నారని ‘బ్రాడ్‌ఫోర్డ్‌ లైసెన్స్‌ ఇండియా’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి సచిల్‌ గోయెల్‌ తెలిపారు. ఈ మేరకు తమకు గత నెలలోనే ‘ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌’ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, వినిమయ వస్తువులు, క్రీడలు సహా పలు పరిశ్రమలకు చెందిన దాదాపు 60 గ్లోబల్‌ బ్రాండ్స్‌ను బ్రాడ్‌ఫోర్డ్‌ నిర్వహిస్తోంది. తాజాగా ఆ జాబితాలో ‘మారడోనా (Maradona)’ కూడా చేరనుంది.

మారడోనా బ్రాండ్‌తో ఉన్న వివిధ రంగాలకు చెందిన వస్తువులను విక్రయించేందుకు భారత్‌లోని ఫ్యాషన్ కంపెనీలు, ఇ-కామర్స్‌, రిటైల్‌ చైన్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు గోయెల్‌ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా సంస్థలతో చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతంపై దృష్టి పెట్టాలనే ఆలోచన తమకు లేదని తెలిపారు. ముఖ్యంగా యువత, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుంటామన్నారు. మారడోనా (Maradona) బ్రాండ్‌ వస్తువులు మార్కెట్‌లో లభించడానికి మరో 3- 4 నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు.

భారత్‌లో ‘మారడోనా’ విక్రయ హక్కులను అర్జెంటీనా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్యాబియన్‌ ఒలెంబర్గ్‌ అనే కంపెనీతో కలిసి బ్రాడ్‌ఫోర్డ్‌ లైసెన్స్‌ పొందింది. క్రీడా దిగ్గజమైన డీగో మారడోనా పేరే తమ ప్రధాన బలమని ఫ్యాబియన్‌ అభిప్రాయపడింది. ఇది తమకు వివిధ రంగాల్లో అనేక విక్రయ అవకాశాలను తీసుకొచ్చి పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

1986లో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ గెలిచింది. దీంట్లో డీగో మారడోనాదే కీలక పాత్ర. ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆయన్ని ఒక గొప్ప ఆటగాడిగా గుర్తిస్తారు. మళ్లీ మూడున్నర దశాబ్దాల నిరీక్షణ తర్వాత అర్జెంటీనా మరోసారి కప్‌ను కైవసం చేసుకుంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అర్జెంటీనా తరఫున మెస్సి (Messi) రెండు గోల్స్‌ (23 పెనాల్టీ, 108 పెనాల్టీ) కొట్టగా.. డిమారియా (36వ) ఓ గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తరఫున స్టార్‌ ఆటగాడు ఎంబాపె (Mbappe) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ.. మొత్తం మూడు గోల్సూ (80 పెనాల్టీ, 81వ, 118 పెనాల్టీ) అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని