McLaren: ‘మెక్‌లారెన్‌’ సూపర్‌ కార్లు భారత్‌కు వచ్చేస్తున్నాయ్‌..

బ్రిటిష్‌ లగ్జరీ సూపర్‌కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్‌ కీలక ప్రకటన చేసింది. 2022 ద్వితీయార్థంలో భారత మార్కెట్లోకి అడుగు.....

Updated : 22 Aug 2022 22:37 IST

దిల్లీ: బ్రిటిష్‌ లగ్జరీ సూపర్‌కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్‌(McLaren) కీలక ప్రకటన చేసింది. 2022 ద్వితీయార్థంలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. మరో రెండు మాసాల్లో (అక్టోబర్‌లో) తొలి డీలర్‌షిప్‌ను ముంబయిలో ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపింది. ఆ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత రహదారులపై ఇకపై ఈ సూపర్‌ లగ్జరీ కార్లు (Super luxary cars) రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్లనున్నాయి. ఇప్పటివరకు 40 దేశాల్లో తమ బ్రాండ్లను విక్రయిస్తున్న ఈ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ.. తాజాగా భారత్‌ను 41వ మార్కెట్ కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. 

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని రిటైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తున్న మెక్‌లారెన్‌.. అక్టోబర్‌ నుంచి ముంబయిలో తమ కార్లను ఇక్కడి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు ఆసియా ప‌సిఫిక్‌, చైనా ఎండీ, డైరెక్టర్‌ పాల్‌ హారిస్ తెలిపారు. ఇక్కడి తమ అభిమానులు, ఎంపిక చేసుకున్న ఖాతాదారులు తమ ఉత్తమ బ్రాండ్‌ ఉత్పత్తులను ఆస్వాదించవచ్చన్నారు. త్వరలోనే ఆర్టురాను భారత్‌లోకి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇదొక సరికొత్త హై-పెర్ఫార్మెన్స్‌ హైబ్రిడ్‌ సూపర్‌ కారు అని పేర్కొన్నారు. ముంబయి రిటైల్‌ కేంద్రంలో మెక్‌లారెన్‌ జీటీ, హె-పెర్ఫార్మెన్స్‌ హైబ్రిడ్‌- ఆర్టురా, 600ఎల్‌టీ, 720 ఎస్‌ కూప్‌, స్పైడర్‌తో పాటు 765ఎల్‌టీ మోడల్స్‌ అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని