Reliance - Disney: రిలయన్స్‌తో డీల్‌.. మా సంస్థకు మేలు చేస్తుంది: బాబ్‌ ఐగర్‌

Reliance - Disney: రిలయన్స్‌తో భాగస్వామ్యం తమ సంస్థకు ఎంతో మేలు చేస్తుందని వాల్ట్‌ డిస్నీ సీఈవో బాబ్‌ ఐగర్‌ తెలిపారు.

Published : 10 Mar 2024 13:50 IST

దిల్లీ: భారత్‌లో రిలయన్స్‌ (Reliance) ఇండస్ట్రీస్‌తో కుదిరిన ఒప్పందం రెండు సంస్థలకు లాభాన్ని చేకూర్చుతుందని వాల్ట్‌ డిస్నీ (Walt Disney) సీఈవో బాబ్‌ ఐగర్‌ (Bob Iger) తెలిపారు. ఈ ఒప్పందం వినోద రంగంలో ఒక పెద్ద సంస్థ ఏర్పాటుకు అవకాశం కల్పించడంతోపాటు మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలబెడుతుందన్నారు. మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్టర్స్‌ సదస్సుల్లో పాల్గొన్న ఆయన విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘21 సెంచరీ ఫాక్స్‌ కొనుగోలు తర్వాత భారత్‌లో మా సంస్థ పెట్టుబడులు పెట్టింది. దీంతో దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో మేం ఒకరిగా ఉన్నాం. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం కావడంతో భారత్‌లో కొనసాగాలని ఆశిస్తున్నాం. కానీ, అందుకు మార్కెట్లో కొన్ని సవాళ్లు అధిగమించాలి. ఈ క్రమంలోనే రిలయన్స్‌తో ఒప్పందం చేసుకునే అవకాశం లభించింది. అతిపెద్ద మీడియా సంస్థలో వాటాను సొంతం చేసుకోవడం ద్వారా మార్కెట్‌లో రెండు సంస్థలు అగ్రస్థానంలో ఉంటాయి. రిలయన్స్‌తో భాగస్వామ్యం మాకు ఎంతో మేలు చేస్తుంది. దాంతోపాటు నష్ట భయం తగ్గుతుంది’’ అని ఐగర్‌ వ్యాఖ్యానించారు. 

రిలయన్స్‌ - వాల్ట్‌ డిస్నీల ఒప్పందం విలువ రూ.70,352 కోట్లు. ఈ మొత్తంతో ఇరు సంస్థలు జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థ సంయుక్త సంస్థలో రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో స్టార్‌ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్‌ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్‌, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్‌ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు.

21 సెంచరీ ఫాక్స్‌ కొనుగోలు తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్‌ సంస్థ 2020లో భారత్‌లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్‌, ప్రపంచకప్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుని వాటి ప్రసారాలతో సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. 2023-27 వరకు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను గతేడాది రిలయన్స్‌కు చెందిన జియో సినిమా సొంతం చేసుకుంది. దీంతో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 55 మిలియన్ల నుంచి 40 మిలియన్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌తో ఒప్పందం కంపెనీకి లబ్ధి చేకూరుస్తుందని భావిస్తోంది. ఈ ఒప్పంద ప్రక్రియ 2024 చివరి త్రైమాసికంలో గానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని