Steve Ballmer: ఒకప్పటి బిల్‌గేట్స్‌ సహాయకుడు.. ఇప్పుడు ప్రపంచంలో టాప్‌ 5 సంపన్నుల్లో ఒకరు!

బ్లూమ్‌బర్గ్‌ తాజా బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో స్టీవ్‌ బాల్మర్‌ ప్రపంచంలోనే ఐదో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఉండటం గమనార్హం. 

Updated : 01 Nov 2023 07:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక సంస్థలో ఉద్యోగి.. యాజమాని సంపాదన స్థాయికి చేరడం కష్టమే. కానీ, దాన్ని సుసాధ్యం చేశారు.. స్టీవ్‌ బాల్మర్‌. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తన మాజీ యజమాని, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌కు చేరువయ్యారు. మరికొన్ని రోజుల్లో బిల్‌గేట్స్‌ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ రియల్‌ టైం జాబితా ప్రకారం 117 బిలియన్‌ డాలర్ల సంపదతో బాల్మర్‌ ప్రపంచంలోనే ఐదో అత్యంత సంపన్నుడిగా మారారు. 122 బిలియన్‌ డాలర్లతో బిల్‌గేట్స్‌ నాలుగోస్థానంలో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఎలాన్‌ మస్క్‌ (193 బిలియన్‌ డాలర్లు), రెండో స్థానంలో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (156 బిలియన్‌ డాలర్లు), మూడోస్థానంలో జెఫ్ బెజోస్‌ (156 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. 

హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే బిల్‌గేట్స్‌తో బాల్మర్‌కు పరిచయం ఏర్పడింది. చదువు పూర్తికాగానే 1980ల్లో బిల్‌గేట్స్‌కు సహాయకుడిగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో అడుగుపెట్టారు. ఈ తర్వాత 1998లో సంస్థ ప్రెసిడెంట్‌, 2000లో సీఈవో స్థాయికి ఎదిగారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థలో బాల్మర్‌కి దాదాపు 4 శాతం వాటా ఉంది. ఉద్యోగికి సంస్థ ఇచ్చే స్టాక్‌ ఆప్షన్‌తో బిలియనీర్‌ అయిన రెండో వ్యక్తిగా బాల్మర్‌ ఘనత సాధించారు. (తొలి వ్యక్తి.. కోకాకోలా కంపెనీ ప్రెసిడెంట్‌, ఛైర్మన్‌, సీఈవోగా పనిచేసిన రాబెర్టో గోయిజెటా) మైక్రోసాఫ్ట్ లాభాల బాటలో ఉండటంతో బాల్మర్‌ సంపద కూడా పెరుగుతూ వస్తోంది. 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా పదవీ విరమణ చేశారు. మరోవైపు లాస్‌ ఏంజిలెస్‌ క్లిప్పర్స్‌ బాస్కెట్‌బాల్‌ జట్టును కొనుగోలు చేశారు. బాల్మర్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల నియమితులైన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని