Microsoft: 3 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి మైక్రోసాఫ్ట్‌.. AIతో కంపెనీ షేర్లకు బూస్ట్‌!

Microsoft: కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్‌ చేస్తున్న పెట్టుబడులతో కంపెనీపై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. దీంతో సంస్థ షేర్లు రాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్‌ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లు దాటింది.

Updated : 25 Jan 2024 11:14 IST

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మూడు ట్రిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయిని దాటిన రెండో కంపెనీ ఇది. సంస్థ షేరు విలువ బుధవారం 1.3 శాతానికి పైగా పెరిగి 404 డాలర్లకు చేరడంతో ఈ రికార్డు నమోదైంది. ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్‌ గతేడాది జూన్‌లో మూడు ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ సాధించిన తొలి సంస్థగా నిలిచింది. బుధవారం ఓ దశలో యాపిల్‌ను దాటేసిన మైక్రోసాఫ్ట్‌.. షేర్లు కుంగడంతో కిందకు దిగొచ్చింది.

2023లో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) షేరు ధర 57 శాతానికి పైగా పుంజుకుంది. ఆ జోరు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. జనవరిలో ఇప్పటి వరకు ఏడు శాతానికి పైగా లాభపడింది. అదే సమయంలో నాస్‌డాక్‌ 100 సూచీ 4.6 శాతం పెరిగింది. కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులే స్టాక్‌ రాణించడానికి కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్‌ఏఐతో కలిసి ఇప్పటికే ఈ కంపెనీ కొత్త AI టూల్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మరిన్ని అత్యాధునిక ఏఐ ఆవిష్కరణలపైనా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరుపై బలమైన విశ్వాసంతో ఉన్నారని నిపుణుల అంచనా. త్వరలో మైక్రోసాఫ్ట్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఆదాయం, లాభాలు అంచనాలను మించుతాయని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని