Mukesh Ambani: మోదీ దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని: ముకేశ్‌ అంబానీ

Mukesh Ambani: గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో రిలయన్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ప్రకటిస్తూనే ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Updated : 10 Jan 2024 15:57 IST

గాంధీనగర్‌: నరేంద్ర మోదీ (Narendra Modi) భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) కొనియాడారు. ఈ తరంలో ప్రపంచంలోనే గొప్ప నాయకుడని ప్రశంసించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్‌ సమ్మిట్‌ (Vibrant Gujarat Summit)’లో ప్రధాని సమక్షంలో బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల క్రితం మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ఇన్వెస్టర్‌ సమ్మిట్‌’గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

‘‘మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రపంచంలో గొప్ప నాయకుడిగా అవతరించారు. దేశ చరిత్రలో ఆయన అత్యంత విజయవంతమైన ప్రధాని. ఆయన మాట్లాడితే యావత్‌ ప్రపంచం వినడమే కాదు.. ప్రశంసల వర్షం కురిపిస్తుంది. విదేశాల్లో ఉన్న నా మిత్రులు ‘మోదీ హై తో ముమ్కిన్‌ హై’ అనే నినాదానికి అర్థమేంటని అడుగుతున్నారు. దానికి నేను సమాధానమిస్తూ.. భారత ప్రధాని తన పట్టుదల, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని చెబుతున్నాను. దానితో వారూ ఏకీభవిస్తున్నారు. విదేశీయులు నూతన ఇండియా అంటే నూతన గుజరాత్‌నే ఊహించుకుంటున్నారు. ఇది కేవలం మోదీ వల్లే సాధ్యమైంది. రాబోయే తరాలు ఆయనకు రుణపడి ఉంటాయి’’ అంటూ ప్రధానిపై అంబానీ (Mukesh Ambani) ప్రశంసల వర్షం కురిపించారు.

గుజరాత్‌లోని (Gujarat) హజీరాలో దేశంలోనే తొలి ప్రపంచ స్థాయి కార్బన్‌ ఫైబర్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు. జామ్‌నగర్‌లో 500 ఎకరాల్లో ‘ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌’ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీంతో హరిత ఇంధన ఉత్పత్తిలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గుజరాత్‌ హరిత ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కాంప్లెక్స్‌ 2024 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.

‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL)’ ఎప్పటికీ గుజరాత్‌దేనని ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) అన్నారు. పదేళ్లలో దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. దీంట్లో మూడో వంతు గుజరాత్‌లోనే వెచ్చించినట్లు వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ 35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు. ఒక్క గుజరాత్‌ రాష్ట్రమే మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు.


గుజరాత్‌కు పెట్టుబడుల వెల్లువ..

వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో (Vibrant Gujarat Summit) భాగంగా అనేక కంపెనీలు ఆ రాష్ట్రంలో తమ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించాయి. అదానీ గ్రూప్‌ వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించింది.

గుజరాత్‌లో అదానీ గ్రూప్‌ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

  • మారుతీ సుజుకీ ఇండియా గుజరాత్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకోసం రూ.35 వేల కోట్లు వెచ్చిస్తామని తెలిపింది. 2030- 31 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతామని వెల్లడించింది.
  • అంతర్జాతీయ స్థాయి టెక్ సంస్థ ఎన్వీడియా.. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో మార్చి ముగిసే నాటికి ‘కృత్రిమ మేధ డేటా సెంటర్‌’ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.
  • హజీరాలో ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర స్టీల్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిత్తల్‌ ప్రకటించారు.
  • గుజరాత్‌లో కంటైనర్‌ టెర్మినల్‌ను నిర్మిస్తామని గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ సంస్థ డీపీ వరల్డ్‌ తెలిపింది.
  • ధొలేరాలో సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు.
  • ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌.. గిఫ్ట్‌ సిటీలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని