Satya Nadella: 75 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ.. సత్య నాదెళ్ల ప్రకటన

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ విత్‌అవుట్‌ బ్యారియర్స్‌’ను భారత్‌కు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. దీంతో మహిళలకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated : 08 Feb 2024 18:27 IST

బెంగళూరు: ఈ ఏడాది చివరికి భారత్‌లో 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అధినేత సత్య నాదెళ్ల (Satya Nadella) ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం బెంగళూరులోని ‘మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూర్‌’ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని ఆయన తెలిపారు.

ఈసందర్భంగా మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తున్న ‘కోడ్‌ విత్‌అవుట్‌ బ్యారియర్స్‌ (Code Without Barriers)’ ప్రోగ్రామ్‌ గురించి నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ‘‘ఈ ప్రోగ్రామ్‌ను భారత్‌లోనూ చేపట్టాలని నిర్ణయించాం. దీనిద్వారా 2024 చివరికి 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నాం. ఈనెల నుంచే దీన్ని ఆరంభించనున్నాం. దీంతో మహిళా డెవలపర్లు (women developers), కోడర్లు, టెక్నికల్‌ రోల్స్‌లో పనిచేసే యువతులకు మరిన్ని నెట్‌వర్కింగ్‌ అవకాశాలు లభిస్తాయి’’ అని ఆయన వెల్లడించారు.

2025 కల్లా 20 లక్షల మందికి AIలో శిక్షణ : సత్య నాదెళ్ల

ఈ ప్రోగ్రామ్‌ను మైక్రోసాఫ్ట్‌ 2021లో తొమ్మిది ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ప్రారంభించింది. క్లౌడ్‌, ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీ రంగాల్లో లింగ అంతరాన్ని తగ్గించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తాజాగా దీన్ని భారత్‌కూ విస్తరిస్తున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు.

ఇక, భారత్‌లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధ (AI)లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. శక్తివంతమైన ఏఐ విస్తరణకు   భారత్‌ - అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు