Nissan: భారత్‌లోకి నిస్సాన్‌ గ్లోబల్‌ కార్లు!

నిస్సాన్‌ భారత్‌లో తమ కార్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించే పనిలో ఉంది. పలు గ్లోబల్‌ కార్లను ఇక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

Updated : 18 Oct 2022 16:02 IST

దిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్‌ తమ పలు అంతర్జాతీయ స్థాయి ఎస్‌యూవీలను భారత విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆయా మోడళ్లు భారత రోడ్లపై ఎలాంటి పనితీరును కనబరుస్తాయో పరీక్షిస్తోంది. నిస్సాన్‌ ఎక్స్‌-ట్రెయిల్‌, జ్యూక్‌, ఖష్కాయ్‌ కార్లను భారత్‌లోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఎక్స్‌-ట్రెయిల్‌, ఖష్కాయ్‌లను ప్రయోగ పరీక్షల్లో భాగంగా భారత రోడ్లపై తిప్పుతున్నట్లు పేర్కొన్నారు. నిస్సాన్‌ మన దేశంలో ఇప్పటికే మాగ్నైట్‌, కిక్స్‌ మోడల్‌ కార్లను విక్రయిస్తోంది.

వివిధ ప్రాంతాలు, రోడ్లపై ఆయా మోడళ్లు వినియోగదారుల అభిరుచులు, అంచనాలనకు అనుగుణంగా నడుస్తున్నాయా.. లేదా.. పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకసారి ప్రయోగ పరీక్షలు పూర్తయిన తర్వాత ఎక్స్‌-ట్రెయిల్‌ను తొలుత విపణిలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తర్వాత దశలవారీగా ఇతర మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. కంపెనీ నుంచి వచ్చిన మాగ్నైట్‌కు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు నిస్సాన్‌ సన్నాహాలు చేస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా ఈ కంపెనీ భారత్‌లో తమ కార్లను విక్రయిస్తోంది. కానీ, ఏటా 30 లక్షల ప్రయాణికుల వాహనాలు అమ్ముడయ్యే మన మార్కెట్‌లో నిస్సాన్‌ వాటా 10 శాతం లోపే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని