Nita Ambani: తాము అబ్బాయిలతో సమానమని అమ్మాయిలు తెలుసుకోవాలి: నీతా అంబానీ

అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని తెలుసుకోవాలంటే తన ఇల్లే ఒక ఉదాహారణ అని ఆసియా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. తన పిల్లలకు వ్యాపారంలో సమాన స్థాయి కల్పించినట్లు పేర్కొన్నారు.

Updated : 27 Oct 2023 03:26 IST

దిల్లీ: అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని తెలుసుకోవాలంటే తన ఇల్లే ఒక ఉదాహారణ అని ఆసియా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. రిలయన్స్‌(Reliance) సామ్రాజ్యంలో చేరేందుకు వారసత్వ ప్రణాళికలో భాగంగా తన ముగ్గురు పిల్లలకు ఎలాంటి భేదాన్ని పాటించలేదన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతా అంబానీ తన కుటుంబం, భర్త ముకేశ్‌ అంబానీతో అనుబంధం తదితర విషయాలు పంచుకున్నారు. 

ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీల ముగ్గురు పిల్లలు ఇషా(Isha), ఆకాశ్‌(Akash), అనంత్‌(Anant) ఇటీవలే రిలయన్స్‌ కంపెనీ బోర్డు(Reliance compamy board)లో చేరారు. కూతురు ఇషాకు రిలయన్స్‌ రిటైల్‌, ఆకాశ్‌కు డిజిటల్‌/టెలికాం రంగాలను, మరో కుమారుడు అనంత్‌కు న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ తన పిల్లలకు వ్యాపారంలో సమాన స్థాయి కల్పించినట్లు పేర్కొన్నారు. ‘‘మా కుటుంబంలో ఒకరి నుంచి మరొకరు ఎంతో నేర్చుకున్నాం. ముకేశ్‌ గురించి చెప్పాలంటే ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తారు. అతని జీవితంలో ఎన్నో వెలుగులు ఉన్నాయి. సరైన జీవిత భాగస్వామిని పొందడం అత్యంత కీలక నిర్ణయమని తరచూ నా పిల్లలకు చెబుతాను. నా బెస్ట్‌ ఫ్రెండ్ ముకేశ్‌ను జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టం. పిల్లల్ని పెంచడం, గ్రాండ్‌ పేరెంట్స్‌గా మారడం ద్వారా మేము జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాం. యుక్త వయసులో ముకేశ్‌ నన్ను డ్రైవ్‌కు తీసుకువెళ్లేవారు. ప్రయాణంలో హిందీ మ్యూజిక్‌ వినేవాళ్లం. స్ట్రీట్‌ ఫుడ్‌ తినేవాళ్లం. నాకు రోడ్డు పక్కన అమ్మే బేల్‌పూరీ అంటే ఇష్టం. తనకు దోశ, ఇడ్లీ అంటే ఇష్టం. గతంలోనివి ఇప్పటికీ మాకు ఇష్టం. కుటుంబాన్ని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, నిజాయితీగా, వినయంగా ఉండడం ఈ రోజుకూ మారలేదు’’ 

‘‘నా కూతురు ఇషాకు ఇద్దరు కవల పిల్లలున్నారు. తను ఇప్పుడు రిలయన్స్‌ రిటైల్‌కు నేతృత్వం వహిస్తోంది. తాము అబ్బాయిలతో సమానమని అమ్మాయిలు తెలుసుకోవాలి. అందుకు నా ఇల్లే ఆదర్శంగా నిలుస్తుంది. అమ్మాయిలు ఏ విషయంలోనూ అబ్బాయిలతో పోలిస్తే తక్కువ కాదు. నా పిల్లలు ఇషా, ఆకాశ్‌, అనంత్‌ పట్ల నేను భేదం చూపలేదు. వ్యాపార పరంగా ఆకాశ్‌, అనంత్‌ ఏం చేయగలరో.. ఇషా కూడా చేయగలదు. రిలయన్స్‌ వారసత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇషాకు వివాహమైనప్పటికీ కుమారులతో సమానమైన వాటా లభిస్తుంది. ఈ ముగ్గురిలో విభిన్న లక్షణాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిరక్షించడంలో, ఉత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దడం విషయంలో నా చిన్న కుమారుడు అనంత్‌లో ఒక దయగల వ్యక్తి కనిపిస్తున్నాడు. జియోతో ఆకాశ్‌ డిజిటల్‌ విప్లవానికి నేతృత్వం వహిస్తున్నాడు. ఇక ఇషా రిలయన్స్‌ ఫౌండేషన్‌లో చురుకైన పాత్రను పోషించడమే కాకుండా రిటైల్‌ బిజినెస్‌లో అగ్రగామిగా ఉంది. ఈ ముగ్గురు రిలయన్స్‌ వృద్ధికి కట్టుబడి ఉన్నారు. ముగ్గురికి సొంత బలాలు ఉన్నాయి’’

‘‘ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఎవరూ పుట్టరు. తప్పులు జరుగుతుంటాయి. మనం విజయం నుంచి కాకుండా తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఎప్పటికీ వినయంగా, దయగల వ్యక్తిగా ఉండాలి. తమ తోటివారికి గౌరవం ఇవ్వాలి. రిలయన్స్‌లో కొత్త తరం వృద్ధి చెందుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని నీతా అంబానీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని