Tesla: భారత్‌లో టెస్లా కోసం ప్రత్యేక పాలసీ లేదు.. స్పష్టతనిచ్చిన కేంద్రం

టెస్లా (Tesla)కు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ఎలాంటి ప్రణాళిక తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు.

Updated : 23 Jul 2023 14:14 IST

దిల్లీ: భారత్‌లో టెస్లా (Tesla) కార్ల పరిశ్రమ నెలకొల్పేందుకు ఆ సంస్థకు ప్రోత్సాహకాలు అందివ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి విధివిధానాలను రూపొందించలేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే, ఆటో అండ్‌ అడ్వాన్స్‌డ్‌ కెమెస్ట్రీ సెల్‌ (ACC) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కింద టెస్లా సంస్థ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 18,100 కోట్లు నుంచి రూ. 26,058 కోట్లతో ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమల కోసం పీఎల్‌ఐ కింద ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని వెల్లడించారు. 

‘‘ఇప్పటికే పీఎల్‌ఐ కింద రూపొందించిన పథకాల గురించి టెస్లాకు చెప్పాం. ఈ పథకం కింద వారు ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. ఒక కంపెనీ కోసం కేంద్రం ప్రత్యేకంగా విధివిధానాలను రూపొందించదు. ఇప్పటి వరకు టెస్లాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలనే ప్రణాళిక కేంద్రం వద్ద లేదు. టెస్లాకు అతిపెద్ద బ్యాటరీ సరఫరాదారుగా ఉన్న పానాసోనిక్ ప్రతినిధులు ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించారు. బ్యాటరీలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. పీఎల్‌ఐ కింద ఏసీసీ బ్యాటరీల కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించాం ’’ అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. 

పక్షి లోగోకు వీడ్కోలు పలకనున్న ట్విటర్‌..!

కొద్దినెలల క్రితం భారత్‌కు వచ్చిన టెస్లా ప్రతినిధులు.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయ్యారు. అంతేకాకుండా  టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సైతం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం మస్క్ మాట్లాడుతూ.. 2024లో తాను భారత్‌కు రానున్నట్లు ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా టెస్లా పరిశ్రమను భారత్‌లో నెలకొల్పుతామని తెలిపారు. 

రెండేళ్ల క్రితం మస్క్‌ మాట్లాడుతూ.. భారత్‌లో విద్యుత్‌ వాహనాలపై దిగుమతి పన్ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పూర్తిగా తయారైన వాహనాల (CBU) దిగుమతిపై భారత్‌లో కస్టమ్స్ సుంకం 60 శాతం నుంచి 100 శాతం వరకు ఉంది. ఇంజిన్‌ పరిమాణం, వ్యయాలు, బీమా, రవాణా విలువల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. అయితే, ప్రస్తుతం చైనా, అమెరికాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా.. చైనాలోని విదేశీ పరిశ్రమలు ఆ దేశాన్ని వీడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ను తమ పెట్టుబడికి ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు