Aprilia RS 457: పియాజియో ప్రీమియం బైక్‌ ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 ఆవిష్కరణ

Aprilia RS 457: ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 (Aprilia RS 457) బైక్‌ను పియాజియో వెహికల్స్‌ గురువారం భారత్‌లో ఆవిష్కరించింది.

Updated : 21 Sep 2023 15:43 IST

దిల్లీ: ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్‌ కంపెనీ పియాజియో భారత అనుబంధ సంస్థ పియాజియో వెహికల్స్‌.. ప్రీమియం ద్విచక్ర వాహన విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 (Aprilia RS 457) బైక్‌ను గురువారం భారత్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో అధిక ఫీచర్లతో కూడిన బైక్‌లకు గిరాకీ పుంజుకుంటోందని పియాజియో వెహికల్స్‌ ఛైర్మన్‌, ఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. అందుకు అనుగుణంగానే ఆర్‌ఎస్‌ 457 (Aprilia RS 457)ను రూపొందించినట్లు వెల్లడించారు. దీని విక్రయాలు వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే పియాజియో వెహికల్స్‌ భారత్‌లో ఏప్రిలియా, వెస్పా బ్రాండ్ల పేరిట ఐదు ప్రీమియం స్కూటర్లను విక్రయిస్తోంది.

ఏప్రిలియా 457 (Aprilia RS 457)లో 457 సీసీ, ట్విన్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను పొందుపర్చారు. 47బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసే ఈ బైక్‌ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తోంది. రైడ్‌-బై-వైర్‌, త్రీ లెవెల్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌, వివిధ రైడ్‌ మాధ్యమాలు, ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. లుక్‌ విషయానికి వస్తే కొంత వరకు ఇది గతంలో వచ్చిన ఆర్‌ఎస్‌ 660 తరహాలోనే ఉంది. ఐదు అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ను అమర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ కూడా ఉంది. ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని