Car sales: రుణరేట్లు పెరిగితే కార్ల విక్రయాలు తగ్గుతాయ్‌: మారుతీ సుజుకీ

Car sales: ఆర్‌బీఐ రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచినప్పటికీ.. దాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిస్థాయిలో వాహన రుణాలకు బదిలీ చేయలేదని మారుతీ సుజుకీ ప్రతినిధి తెలిపారు.

Published : 07 Jan 2024 12:48 IST

దిల్లీ: వాహన రుణ రేట్లు పెరిగితే ప్రయాణికుల వాహన విక్రయాలు (Passenger vehicle sales) తగ్గిపోయే అవకాశం ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. 2023లో రికార్డు స్థాయిలో 41.08 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడైనట్లు ఆయన గుర్తుచేశారు. దీనితో పోల్చినప్పుడు ఈ ఏడాది విక్రయాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు సానుకూలంగా ఉండడం మాత్రమే వాహన విక్రయాలకు కలిసొస్తుందని వివరించారు. 2023లో విక్రయాలు గరిష్ఠ స్థాయికి చేరాయని అభిప్రాయపడ్డారు. భారీ ప్రాతిపదిక (base) నేపథ్యంలో వృద్ధి తగ్గుతుందని చెప్పారు. వాహన విక్రయాలు 2021లో 27 శాతం, 2022లో 23 శాతం, 2023లో 8.3 శాతం చొప్పున పెరిగినట్లు తెలిపారు. ఈ లెక్కన ఈ ఏడాదీ అమ్మకాల్లో ఏక అంకె వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు.

‘‘వాహన రుణరేట్లు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ కట్టడి కోసం ఆర్‌బీఐ (RBI) ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దాన్ని బ్యాంకులు ఇంకా వాహన రుణాలకు పూర్తిగా బదిలీ చేయలేదు. ఇంకా 120 బేసిస్‌ పాయింట్ల మేర పెరగాల్సి ఉంది. ఈ ఏడాది రేట్ల కోత లేకపోతే.. అది వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని శ్రీవాస్తవ వివరించారు.

గిరాకీ తగ్గడం, 2023 ఆర్డర్ల ఉపసంహరణ వంటి అంశాల ప్రభావమూ ఈ ఏడాది అమ్మకాలపై ఉంటుందని శ్రీవాస్తవ వివరించారు. చాలా మోడళ్ల కోసం ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. పరికరాల సరఫరాలో తలెత్తిన ఇబ్బందులూ తొలగిపోయాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని