2000 Notes: ₹2 వేల నోటు ఉపసంహరణ ప్రయోజనకరమే: మాజీ సీఈఏ

రూ.2వేల నోట్ల ఉపసంహరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని ఆర్థికశాఖ మాజీ సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. ఇందుకు పలు కారణాలను కూడా ఆయన వివరించారు.

Updated : 20 May 2023 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చేసిన శుక్రవారం చేసిన ఆకస్మిక ప్రకటన.. విపక్షాల విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా.. ప్రతిపక్షాలు మాత్రం కేంద్రంపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ మాజీ ప్రధాన సలహాదారు (Ex CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ (Krishnamurthy Subramanian).. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనన్నారు. అందుకు కొన్ని అంశాలతో ఆయన వివరణ ఇచ్చారు. మరి సుబ్రమణియన్‌ ఏం చెప్పారంటే..?

* రూ.2వేల నోటు ఉపసంహరణతో నగదు నిల్వ ఉంచుకోవడం తగ్గుతుంది. రూ.3.6లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇందులో కొంతభాగం ఎక్కడుందో కూడా తెలియదు. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఎందుకంటే.. ఈ మధ్య తరచూ దర్యాప్తు సంస్థల దాడుల్లో నోట్ల గుట్టలు బయటపడుతుండగా.. అందులో రూ.2వేల నోట్లే అధికం. దేశంలో 80శాతం మంది ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను చట్టబద్ధంగా భద్రపర్చుకున్నారు. కానీ ఆ నోట్ల విలువ మొత్తం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్ల విలువలో కేవలం 20శాతం మాత్రమే కావడం గమనార్హం. మిగతా 20శాతం మంది వద్ద ఉన్న రూ.2వేల నోట్ల గుట్టల విలువ 80శాతంగా ఉంది. ఇప్పుడు అదంతా వెలికి తీసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ఇక, ఈ నోటు ఉపసంహరణ కారణంగా సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. అందుకు ఐదు కారణాలున్నాయి..!

  • 1. ప్రస్తుతం రూ.2వేల నోటును చెల్లింపుల కోసం ఎక్కువగా వినియోగించట్లేదు. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో ఈ నోట్ల విలువ కేవలం 10.8శాతమే.
  • 2. ఇప్పుడు అత్యధిక లావాదేవీలు డిజిటల్‌ చెల్లింపుల రూపంలోనే జరుగుతున్నాయి. అందువల్ల, కరెన్సీ నోట్లు ముఖ్యంగా రూ.2వేల నోటు వినియోగం క్రమక్రమంగా మరింత తగ్గిపోతుంది.
  • 3. రూ.2వేల నోటుకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకునేందుకు మరో పెద్ద నోటు రూ.500 నోటు ఉంది. నగదు మార్పిడి కోసం ఈ నోట్లను వాడుకోవచ్చు.
  • 4. 2026 నాటికి డిజిటల్ లావాదేవీలు మూడు రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల రాబోయే ఏళ్లలో రూ.2వేల నోటు వినియోగం అవసరం ఉండకపోవచ్చు.
  • 5. ఇక, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. రూ.2వేల నోటు చెల్లుబాటు (లీగల్‌ టెండర్‌) కొనసాగుతుందని ఆర్‌బీఐ చెప్పింది. సెప్టెంబరు 30 తర్వాత కూడా ఇది చెల్లుబాటు అవుతుందా లేదా అనే దానిపై ఆర్‌బీఐ మళ్లీ స్పష్టతనిస్తుంది. అప్పటివరకు చట్టపరంగా భద్రపర్చుకున్న వారు తమ రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఏ సమస్యా ఉండదు. ఎలా చూసినా ఈ నిర్ణయం సరైందే..!

అని కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తన ట్విటర్‌ ఖాతాలో వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని