Rental Bond: ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా?సెక్యూరిటీ డిపాజిట్‌ కంటే రెంటల్‌ బాండ్‌ మేలు!

Rental Bond: ఇల్లు అద్దెకు తీసుకునేవారు సెక్యూరిటీ డిపాజిట్‌ భారాన్ని తగ్గించుకోవడానికి రెంటల్‌ బాండ్‌ ఒక మేలైన మార్గం. దీని ద్వారా యజమాని, అద్దెదారులకు మధ్య మంచి నమ్మకం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

Updated : 03 May 2023 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఎంతో కొంత సెక్యూరిటీ డిపాజిట్‌ కింద యజమానికి ముందే చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ మొత్తం మారుతుంది. హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ సామాన్యులకు పెద్ద భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగానే రెంటల్‌ బాండ్స్‌ (Rental Bond) అనే ప్రత్యేక విధానం అందుబాటులో ఉంది. ఇది యజమానితో పాటు అద్దె తీసుకునే వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రెంటల్‌ బాండ్‌ అంటే..

సులభంగా చెప్పాలంటే యజమానులకు అద్దెకు తీసుకునేవాళ్లు ఇచ్చే ఆర్థిక భరోసానే రెంటల్‌ బాండ్‌ (Rental Bond). ఇది భారత్‌లో ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. వీటిని జారీ చేసేందుకు ప్రత్యేకంగా కంపెనీలు ఉంటాయి. ష్యూరిటీ ప్రొవైడర్లు కూడా వీటిని అద్దె తీసుకునేవారి తరఫున జారీ చేస్తుంటారు. కొంత ఫీజు చెల్లించి వీటిని పొందొచ్చు. అద్దెకు తీసుకునేవారి ఆర్థిక చరిత్రను పరిశీలించి బాండ్‌ (Rental Bond)ను జారీ చేస్తారు. యజమానికి ఇది ఒక భరోసా లాంటిది. అద్దె తీసుకోబోయేవారి ఆర్థిక స్తోమత బాగానే ఉందని.. వారికి సకాలంలో అద్దె చెల్లించే సామర్థ్యం ఉందని హామీ ఇవ్వడమే బాండ్‌ వెనకున్న అసలు ఉద్దేశం.

ఎలా పనిచేస్తుంది?

ఒకవేళ అద్దెకు ఇల్లు తీసుకున్నవారు మధ్యలో ఎగవేస్తే బాండ్‌ (Rental Bond)లో ఇచ్చిన హామీ మొత్తాన్ని యజమానికి బాండ్‌ జారీ చేసిన సంస్థలే చెల్లిస్తాయి. తర్వాత ఆ మొత్తాన్ని బాండ్‌ తీసుకున్నవారి దగ్గరి నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకులు రుణాన్ని వసూలు చేసే సమయంలో అనుసరించే ప్రక్రియనే రెంటల్‌ బాండ్‌ (Rental Bond) జారీ సంస్థలు కూడా అవలంబిస్తాయి.

యజమానులకు ప్రయోజనాలు..

ఆర్థిక రక్షణ: ఒకవేళ అద్దెదారులు అద్దె సకాలంలో చెల్లించకపోతే.. బాండ్‌ (Rental Bond) ద్వారా దాన్ని రాబట్టుకోవచ్చు. లేదా ఇంటికి ఏదైనా డ్యామేజ్‌ చేసినా కూడా బాండ్‌లో పేర్కొన్న హామీ మొత్తం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు.

అద్దెదారులదే బాధ్యత: బాండ్‌ అంటే ఒక చట్టబద్ధమైన హామీ పత్రం. ఈ నేపథ్యంలో అద్దెదారులు ఇంటి పట్ల బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. లేదంటే లీజ్‌ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించనట్లవుతుంది. అలాంటప్పుడు చట్టపరంగా వెళ్లి జరిగిన నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు యజమానికి హక్కు ఉంటుంది.

భద్రత: రెంటల్ బాండ్‌ (Rental Bond) యజమానులకు ఒక భద్రతను కల్పిస్తుంది. తమ ఇంటికి ఎలాంటి హాని జరగబోదనే భరోసానిస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగినా.. తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉంటుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

అద్దెదారులకు ప్రయోజనాలు..

  • అద్దెకు ఇల్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తెలియని వారికి ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే యజమానులు సాధారణంగా విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రెంటల్‌ బాండ్‌ అండగా ఉంటుంది.
  • అద్దె తీసుకునేవారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. యజమాని కచ్చితంగా ఇంటికి ఎప్పటికప్పుడు కావాల్సిన మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. లేదంటే అద్దెదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక్కోసారి యజమానులు ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయమని అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో అద్దెదారులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బాండ్‌ (Rental Bond)ను ఉపయోగించుకోవచ్చు. ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలనన్నింటిని యజమాని కూడా పాటించాల్సి ఉంటుంది.
  • ఒప్పందం ముగిసిన తర్వాత రెంటల్‌ బాండ్‌ (Rental Bond)ను అద్దెదారునికి యజమాని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. తద్వారా తమ ఇంటికి ఎలాంటి డ్యామేజ్‌ జరగలేదని.. అద్దె బకాయిలు లేవని యజమాని హామీ ఇచ్చినట్లు అవుతుంది. ఫలితంగా భవిష్యత్‌లో అద్దెదారులకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు.
  • రెంటల్‌ బాండ్‌ (Rental Bond) తీసుకునేటప్పుడు అందులో నియమ నిబంధనల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఎంత మొత్తం చెల్లించాలి, ఎప్పటి వరకు అద్దెకు ఉండొచ్చు, ముందు నుంచే ఇంటికి ఏమైనా డ్యామేజ్‌లు ఉన్నాయా? ఉంటే వాటిని ఒప్పందంలో పేర్కొన్నారా? వంటి అంశాలను పరిశీలించుకోవాలి. ఒకవేళ ముందే డ్యామేజ్‌ ఉంటే అద్దెదారులపై యజమాని ఎలాంటి బాధ్యతలను ఉంచుతున్నారో చూసుకోవాలి. వీలైతే.. ఇంటి పరిస్థితిని వీడియో, ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసి పెట్టుకుంటే ఇంకా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

యజమానులు, అద్దెదారులకు మధ్య రెంటల్‌ బాండ్‌ (Rental Bond) ఒక నమ్మకాన్ని పాదుకొల్పుతుంది. ఇరు పక్షాల హక్కులను కాపాడుతుంది. ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని