Health insurance: ‘క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌’ తప్పనిసరి తీసుకోవాలా?

వైద్య ఖర్చులు రోజురోజుకీ ఖరీదవుతున్న నేపథ్యంలో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు...

Updated : 13 Aug 2022 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్య చికిత్సలు రోజురోజుకీ ఖరీదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికీ ‘క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ ఉండడం ఎంతో అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. జీవిత బీమా లేదా ఆరోగ్య బీమాకు రైడర్‌గా దీన్ని తీసుకోవచ్చు. కావాలంటే ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ ఒక్కటే తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.

కుటుంబానికి ఆర్థిక భరోసా..

క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, ప్రధాన అవయవాల మార్పిడి వంటి దాదాపు మూడు డజన్ల అత్యవసర వ్యాధులకు బీమా కంపెనీలు పాలసీని అందజేస్తున్నాయి. ఏవైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలను గుర్తించినప్పుడు, నిర్దిష్ట చికిత్స ఖర్చును కవర్ చేసే పూర్తి బీమా మొత్తాన్ని కంపెనీయే చెల్లిస్తుంది. సాధారణంగా అనారోగ్యం కారణంగా పాలసీదారు ఆదాయాన్ని కోల్పోతారు. అటువంటి సమయంలో ఈ పాలసీ ద్వారా అందే డబ్బులతో చికిత్స చేయించుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు. అదే ఆరోగ్య బీమాలోనైతే.. కేవలం మీ జబ్బుకు సంబంధించిన ఖర్చులను మాత్రమే బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

ఇప్పటికే అనారోగ్యం ఉంటే..

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బీమా పాలసీల్లో 30 నుంచి 90 రోజుల ‘వెయిటింగ్‌ పీరియడ్‌’ ఉంటుందని గుర్తించుకోవాలి. అంటే, ఈ సమయం పూర్తయిన తర్వాతే మీకు బీమా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే పాలసీని కొనుగోలు చేయడం సాధ్యంకాదు. అయితే అధిక రక్తపోటు, మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. పాలసీదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద చెల్లించే ప్రీమియంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందుతారు.

ఎందుకు తీసుకోవాలి?

గతంలో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్, కరోనరీ ఆర్టరీ బైపాస్ వంటి వ్యాధులు ఉన్నట్లయితే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులుంటే తక్కువ ప్రీమియంతో తగినంత పాలసీని తీసుకోవడం మంచిది. వయస్సు, ఆదాయం, ప్రాంతాన్ని బట్టి ఎంత మొత్తం బీమా తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. సాధారణంగా, తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డప్పుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడు నెలవారీ ఆదాయాన్ని కోల్పోతారు. కాబట్టి, ఆసుపత్రిలో చేరడం, మందులు, ఇంటి ఖర్చులకు సరిపోయే బీమా కవర్‌ను తీసుకోవాలి. అలాగే ఏమైనా రుణాలు, పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

రైడర్‌? ప్రత్యేక పాలసీ?

రైడర్‌గా కంటే కూడా ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ పాలసీని తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కాస్త ప్రీమియం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని